2003లో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సొంతం చేసుకొన్న “ఐతే” టైటిల్ ను వాడి “ఆంధ్రా పోరి” ఫేమ్ రాజ్ మదిరాజు తెరకెక్కించిన సైబర్ క్రైమ్ థ్రిల్లర్ “ఐతే 2.0”. అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని రెండేళ్లవుతున్నా.. కారణాంతరాల వలన ఇవాళ (మార్చి 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏమేరకు థ్రిల్ చేసిందో చూద్దాం..!!
కథ : ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం దొరక్క, తిండికి కూడా దిక్కులేక ఫ్రెండ్ రిలేటివ్ అపార్ట్ మెంట్ లో ఫ్రీగా ఉంటూ కాలం నెట్టుకొస్తుంటారు నలుగురు యువకులు (అభిషేక్ గుప్తా, కర్తవ్య శర్మ తదితరులు). తన ఫ్రెండ్ ఇచ్చే ఔట్ సోర్సింగ్ ప్రొజెక్ట్సే వాళ్ళకి డబ్బు సంపాదించిపెడుతుంటాయి. అయితే.. ఏదైనా సాధించాలి అనే ఉద్దేశ్యంతో ఎస్.ఎం.ఎస్ బ్యాంకింగ్ సాఫ్ట్ వేర్ ను క్రియేట్ చేస్తారు ఈ టీం. “యురేఖా” అనే పేరు పెట్టిన ఈ సాఫ్ట్ వేర్ ను అవినాష్ గంగూలీ (ఇంద్రనీల్ సేన్ గుప్తా)కి అమ్మాలనుకొంటారు. లక్ష మిలియన్ డాలర్స్ కి డీల్ కూడా కుదుర్చుకుంటారు. అన్నీ సెట్ అనుకొన్న తరుణంతో.. అవినాష్ తన దొంగ తెలివితేటలతో ఈ నలుగురు స్నేహితుల్ని మోసం చేసి ఆ సాఫ్ట్ వేర్ ను సొంతం చేసుకొంటాడు. తాము మోసపోయాం అని తెలుసుకోనేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకు రివెంజ్ గా బ్యాంక్ ను హ్యాక్ చేసి తాము పోగొట్టుకొన్న డబ్బుని తిరిగి సంపాదించాలనుకొంటారు. వారి ప్రయత్నం ఫలించిందా? ఇందుకోసం వారు ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేది “ఐతే 2.0” కథాంశం.
నటీనటుల పనితీరు : అందరూ కొత్త నటీనటులే కావడంతో ఎవరికి తోచినట్లుగా వారు నటించారు. క్యారెక్టరైజేషన్స్ లో ఉన్న క్లారిటీ.. కథాగమనంలో లేకపోవడంతో సినిమా సాగే కొద్దీ పాత్రల వేల్యూ పడిపోతుంటుంది. హీరోయిన్లుగా నటించిన జరా షా, మృదాంజలిలు గ్లామర్ ను సినిమాకి యాడ్ చేయగలిగారు. అయితే.. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అనేవి సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో ఆడియన్స్ కి వారి పాత్రలు అర్ధం కావు. విలన్ గా ఇంద్రనీల్ సేన్ గుప్తా మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు. సైకో విలన్ గా ఆకట్టుకొన్నాడు. కథ మొత్తం విలన్ పాయింటాఫ్ వ్యూలో చెప్పడం వల్ల అతడి పాత్ర బరువు కూడా పెరిగింది.
సాంకేతికవర్గం పనితీరు : అరుణ్ చిలువేరు మ్యూజిక్ మాత్రమే కాదు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అవుట్ డేటేడ్ గా ఉంది. ఒక డిజిటల్ ఫామ్ సినిమాకి ఇంకా ఓల్డ్ మ్యూజింగ్స్ తో సంగీతం సమకూర్చడం అనేది ఎందుకో అర్ధం కాలేదు. కౌశిక్ అభిమన్యు తనకు లభించిన స్వేచ్చ మేరకు తన సినిమాని బ్రైట్ గా చూపించడానికి ప్రయత్నించాడు. అయితే.. కెమెరా ఫ్రేమ్స్ మరీ షార్ట్ ఫిలిమ్ తరహాలో ఉండడం అనేది మైన్స్ అయ్యింది. కిట్టు విస్సాప్రగడ రాసిన మాటల్లో భాష్యం అందరికీ చేరువవ్వదు. పైగా ఎక్కువగా ఇంగ్లీష్ బూతులు వాడడం ఎందుకో అర్ధం కాలేదు. నిర్మాణ విలువలు సోసోగా ఉన్నాయి. సీజీ వర్క్ కూడా పేలవంగా ఉంది.
దర్శకుడు రాజ్ మదిరాజు రాసుకున్న కథ ప్రెజంట్ జనరేషన్ కి తగ్గట్లుగా ఉంది. అయితే.. స్క్రీన్ ప్లే మాత్రం సినిమాకి మైనస్. సీన్ టు సీన్ కంటిన్యూటీ లేదు. పైగా 2016లో పూర్తైన సినిమాని 2018లో విడుదల చేస్తున్నప్పుడు కనీస స్థాయి జాగ్రత్తలు కూడా తీసుకోకుండా.. సినిమాలో చూపించే డేట్స్ మార్చకుండా ఉంచేయడం వలన ఏదో పాత సినిమా చూస్తున్నామనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. అలాగే.. చివర్లో ఎప్పుడో సంవత్సరం క్రితం బ్యాన్ చేయబడ్డ 1000 రూపాయల నోట్లను ఆఖర్లో కనీసం గ్రాఫీక్స్ తో అయినా కవర్ చేయాల్సింది. ఇలాంటి బేసిక్ విషయాలను కూడా పట్టించుకోకపోవడం, పైగా సాఫ్ట్ వేర్ నాలెడ్జ్ ఉంటే తప్ప ఏమాత్రం అర్ధం కాని పదాలను పేరాలకు పేరాలు వాడడం అనేది సగటు ప్రేక్షకులకు తలనొప్పి తెప్పిస్తుంది.
విశ్లేషణ : 2003లో సంచలనం సృష్టించిన “ఐతే” సినిమాకి అప్ గ్రేడెడ్ వెర్షన్ లా “ఐతే 2.0” వస్తుందంటే కనీస స్థాయి సినిమా అయ్యుంటుందని భావించారు కొందరు. అయితే.. కథ బాగానే ఉన్నా ప్రేక్షకుడికి చిరాకు తెప్పించే కథనం, అర్ధం కానీ నటీనటుల పెర్ఫార్మెన్స్ కలగలిసి “ఐతే 2.0″ను ఏమాత్రం అలరించలేని ప్రయత్నంగా నిలిపాయి.