అజిత్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ‘గ్యాంబ్లర్’ (మంకాత్త) కి ప్రత్యేక స్థానం ఉంటుంది. సినిమాలో అజిత్ హీరోనే కానీ.. ఎక్కడో చిన్న నెగిటివ్ టచ్ కూడా ఉంటుంది. దీంతో ఆ పాత్ర బాగా పండింది అని చెబుతారు. యాటిట్యూడ్, లుక్, ఫీల్.. ఇలా అన్నీ కొత్తగానే ఉంటాయి. 12 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ మాస్ సినిమాలకు టూడూ లిస్ట్‌లా ఉంటుంది. అయితే అందులో కాస్త కొత్త రకం స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా?
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న, అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా చెప్పే ఈ అంశాలను నాగార్జున ఫ్యాన్స్ అనాలి. ఎందుకంటే ఈ సినిమా కథ తొలుత నాగార్జున దగ్గరకు వచ్చిందట. అయితే వివిధ కారణాల వల్ల ఆ సినిమాలో నాగ్ నటించలేదు. ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పుకొచ్చారు. నాగచైతన్య – వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వెంకట్ ప్రభు మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.
తెలుగులో మీకు, మీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది కదా.. స్ట్రైట్ సినిమాకు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అని అడిగితే.. నేను దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే తెలుగులో సినిమా చేయాలని ప్రయత్నించాను. అజిత్‌తో చేసిన ‘గ్యాంబ్లర్’ (మంకాత్త)ను ద్విభాషా చిత్రంగా చేయాలని అనుకున్నాం. అందులో తెలుగు వెర్షన్‌కు హీరోగా నాగార్జునను అనుకున్నాం అని అసలు విషయం చెప్పారు వెంకట్ ప్రభు.
అయితే నాగార్జున కొన్ని కారణాల వల్ల ఆ సినిమా (Gambler) చేయలేకపోయారని, ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పారు. అంతే కాదు తన ఎంట్రీ ఆ మధ్య ఓకే అనుకున్నా అవ్వలేదు అని కూడా చెప్పారు. ‘మానాడు’ సినిమాను తొలుత తెలుగులో చేయాలని నిర్మాత శ్రీనివాస చిట్టూరి ప్రయత్నించారని, కానీ వర్కవుట్ అవ్వలేదని తెలిపారు. అయితే ఆ సినిమా విడుదలై హిట్టయ్యాక తెలుగు రీమేక్ రైట్స్ కొన్నారని తెలిపారు. అయితే ఆ రీమేక్ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు.