మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చెయ్యబోతున్న ఈ రీమేక్ ను మొదట ‘సాహో’ దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేస్తాడంటూ ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని చిరు కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే సుజీత్ మెగాస్టార్ రేంజ్ కు తగినట్టుగా స్క్రిప్ట్ రెడీ చెయ్యకపోవడం వల్ల అతన్ని పక్కన పెట్టినట్టు కూడా వార్తలు వచ్చాయి.
ఓ దశలో వినాయక్ ఈ రీమేక్ ను తెరకెక్కించే ఛాన్స్ ఉందని.. మరో దశలో ఈ రీమేక్ ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదట. ఇటీవల దర్శకుడు వినాయక్… చిరుని కలిసి స్క్రిప్ట్ ను వినిపించగా.. కొన్ని మార్పులతో చిరు ఓకే చేసినట్టు తెలుస్తుంది. ‘స్పైడర్’ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని రాంచరణ్ తో కలిసి నిర్మించబోతున్నారని టాక్. ‘ఆచార్య’ చిత్రాన్ని సమ్మర్ లోపే ఫినిష్ చేసి, ఇక సమ్మర్ నుండీ ‘లూసిఫర్’ రీమేక్ ను మొదలుపెట్టాలని చిరు భావిస్తున్నారట.
ఈ రీమేక్ ను 4 నెలల్లోనే ఫినిష్ చెయ్యాల్సిందిగా దర్శకుడు వినాయక్ ను.. చిరు కోరినట్టు కూడా టాక్ వినిపిస్తుంది. అటు తరువాత చిరు … బాబీ డైరెక్షన్లో ఓ సినిమా, మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ కూడా చెయ్యబోతున్నట్టు సమాచారం.