లాంచ్ అయిన కొద్ది రోజుల్లో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న తెలుగు ఓటీటీ ‘ఆహా’… దక్షిణాది ఓటీటీగా మారడానికి తొలి అడుగులు ప్రారంభించింది. దీని కోసం తమ నెక్స్ట్ టార్గెట్‌గా తమిళ చిత్ర పరిశ్రమను పెట్టుకుందని తెలుస్తోంది. ‘ఆహా’కు ఇప్పటికే తమిళనాడులో చందాదారుల సంఖ్య బాగానే ఉంది. దీంతో ‘ఆహా’లో తమిళ్ ఒరిజినల్స్ తీసుకొస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట ‘ఆహా’ పెద్దలు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే చెన్నైలో భారీ ఎత్తున లాంచ్ ఈవెంట్ పెడతారనే వార్తలూ వస్తున్నాయి.
తమిళనాడులో ప్రస్తుతం అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్ తప్ప ఓటీటీలు పెద్దగా లేవు. సన్ నెక్ట్స్ ఒక్కటే ఎంతో కొంత ప్రభావం చూపించగల ఓటీటీ. అయితే అందులో సిరీస్, డైరెక్ట్ రిలీజెస్ లాంటివి లేవు. దీంతో ఆ స్పేస్‌ను ‘ఆహా’తో ఫిల్ చేయాలని అల్లు అరవింద్ అండ్ టీమ్ డిసైడ్ అయ్యారట. అందులో భాగంగా ఇకపై రూపొందించే కంటెంట్ తెలుగు – తమిళ భాషల్లో ఉండేలా చూడాలని నిర్ణయించారట. ఈ క్రమంలో ఇటీవల అమలాపాల్ – పవన్ ఉడయార్‌తో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారని మనం చదువుకున్నాం.
‘ఆహా’కు తెలుగులో తొలుత విజయ్ దేవరకొండ, ఆ తర్వాత అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నవారు. యాడ్స్ వారి మీదే షూట్ చేస్తూ వచ్చారు. తమిళంలోనూ ఇదే తరహాలో సూపర్‌స్టార్స్‌ను తీసుకొస్తున్నారని తెలుస్తోంది. అల్లు అరవింద్‌కు తమిళంలో బాగా పరిచయం ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. చిత్ర నిర్మాణం విషయంలో కూడా సూర్య, అల్లు అరవింద్ కలసి పని చేసిన సందర్భాలున్నాయి. మరోవైపు అల్లు కుటుంబానికి సూర్య బాగా దగ్గర. దీంతో సూర్యనే తమిళ ‘ఆహా’ భుజానెత్తుకుంటాడని సమాచారం.