ఏ సినిమా కోసమైనా హీరోలు కష్టపడతారు. అయితే వాళ్ల కష్టానికి విలువ ఆ సినిమా ఫలితం చెబుతుంది. హిట్ కొట్టాక ఆ హీరో ఆ సినిమా కోసం పడ్డ కష్టాలు చెబుతుంటే వావ్ అనిపిస్తుంది. అలా తన వావ్ మూమెంట్స్‌ను చెప్పి అందరితో వావ్ అనిపించుకున్నాడు బన్నీ. ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమా థ్యాంక్స్ మీట్ జరిగింది. ఆ వేదిక మీద అల్లు అర్జున్ (Allu Arjun) తమ సినిమా కోసం పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
‘పుష్ప: ది రూల్’ సినిమా కోసం మా కష్టాన్ని, సినిమాకు వచ్చిన విజయాన్ని నా అభిమానులకు అంకితమిస్తున్నా అని గర్వంగా చెప్పుకొచ్చాడు బన్నీ. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. పోస్టర్‌పై నా బొమ్మ చూసుకున్న ప్రతిసారీ ఎంత అదృష్టమో అనిపిస్తుంది. రెండు వేల మంది నాపై చూపించిన ప్రేమకు నేను ప్రతిబింబాన్ని. ఇదంతా మైత్రీ మూవీ మేకర్స్ వల్లే సాధ్యమైంది. ఈ విజయం పూర్తి క్రెడిట్ సుకుమార్‌దే.
సినిమా కోసం ఐదేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. సినిమా గురించి మాట్లాడుతూ చాలామంది క్లైమాక్స్ ఫైట్ ఎలా చేశారని అడుగుతున్నారు. ఆ సీక్వెన్స్‌లో రెండు సీన్స్ మినహా మిగతావన్నీ రోప్ షాట్సే. 20 రోజుల పాటు రోప్స్‌తోనే ఆ షూటింగ్ చేశాం. ఆ ఫైట్‌ను నవకాంత్ మాస్టర్ అద్భుతంగా డిజైన్ చేశారు అని చెప్పాడు బన్నీ. అన్ని రోజులు తీసినా, నాకు చిన్న గీత కూడా పడలేదు. అది ఆయన సామర్థ్యం అని మెచ్చుకున్నాడు.
‘పుష్ప: ది రైజ్’ సినిమాకు బన్నీ పడ్డ కష్టానికి మంచి గుర్తింపే వచ్చింది. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నాడు. మరిప్పుడు రెండో పార్టుకి ఎలాంటి ప్రశంసలు, అవార్డులు వస్తాయో చూడాలి. ఇండస్ట్రీలో అయితే మరోసారి బన్నీకి అదే పాత్రకు మరోసారి జాతీయ పురస్కారం దక్కుతుంది అని అంటున్నారు. ఒకే పాత్రకు రెండుసార్లు ఇస్తారా? అనేదే చూడాలి.