అల్లు అర్జున్ (Allu Arjun), అట్లీ (Atlee Kumar) కాంబినేషన్‌లో రూపొందబోయే AA22 X A6 సినిమాపై ఇండస్ట్రీ అంతా భారీగా అంచనాలు పెట్టుకుంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సన్ పిక్చర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ రూ.800 కోట్లు అని తెలిసి, ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు SSMB29 అనంతరం భారతదేశంలో ఇంత బడ్జెట్‌తో వచ్చిన రెండో సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.1600 కోట్లు వసూలు కావాలి.
ఇది సాధారణ టార్గెట్ కాదు. ప్రస్తుతం బాక్సాఫీస్ రికార్డ్స్ పరంగా ‘పుష్ప 2’ (Pushpa 2) కూడా దాదాపు రూ.1265 కోట్ల వరకే వచ్చింది. అలాంటి స్థాయిలో ఈ సినిమా కూడా రాబడితేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అందుకే ఫ్యాన్స్ కంటే ట్రేడ్ లో ఈ సినిమాపై బెట్టింగ్ వేసిన వారే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సినిమాలో ఓ ఇంటెన్స్ మాఫియా బ్యాక్‌డ్రాప్ ఉండబోతోందని, అలాగే సైన్స్ ఫిక్షన్ టచ్ కూడా ఉంటుందని టాక్.
అంటే మాస్, క్లాస్, టెక్నికల్ కమర్షియల్ అంశాలు అన్నీ కలిపి ఈ సినిమాను యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అట్లీ గతంలో ‘జవాన్’ (Jawan) వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు, బన్నీ ‘పుష్ప’తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌కి మళ్ళీ అంతే స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకం ఉంది. కానీ సోషల్ మీడియాలో టాక్, రివ్యూలు కాస్త తేడాగా వస్తే మాత్రం ఈ రేంజ్ బడ్జెట్ చిత్రానికి ప్రాణాంతకం కావచ్చు.
కనీసం కంటెంట్ మరిచి, హైప్ మీద నడవలేని రోజుల్లో ఈ సినిమా పూర్తిగా కథ మీదే ఆధారపడాలి. ఈ ట్రెండ్ లో బన్నీ అట్లీ కలిసి ఇండస్ట్రీకి తలుపులు తెరిచినా, అదే తలుపులు మూసుకునే ప్రమాదం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ అప్డేట్‌తోనే హైప్ వచ్చేసింది. కానీ ఈ సినిమాతో ఇండియన్ సినిమా బడ్జెట్, మార్కెట్ ఏ స్థాయిలో ఉందో చెప్పే సమయం ఇదే కావొచ్చు. AA22 X A6 ఇండస్ట్రీని షేక్ చేస్తుందా, లేక రిస్క్‌గా మిగిలిపోతుందా అన్నది థియేటర్లలోనే తెలుస్తుంది.