నిర్మాణం.. నటన… ఈ రెండు సినిమా పరిశ్రమలో భాగమే. ఈ రెంటింటిని ఒకేసారి నెత్తిన ఎత్తుకోవడమంటే చాల కష్టం. కానీ ఇష్టంగా ఈ బాధ్యతలు మోయడానికి యువహీరోలు ముందుకు వస్తున్నారు. ఓ వైపు హీరోగా సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబు తన సినిమాలకు నిర్మాణంలో భాగం పంచుకుంటుంటే.. నాని మాత్రం చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగానే కాకుండా సక్సస్ ఫుల్ నిర్మాతగా నిరూపించుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి ఖైదీ నంబర్ 150 మూవీ తీశారు. ఇప్పుడు మళ్ళీ తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి తోనే సైరా మూవీ చేస్తున్నారు.
వీళ్ళ బాటలోకి అల్లు అర్జున్ వచ్చారు. నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కి గీతా ఆర్ట్స్ అనే పెద్ద నిర్మాణ సంస్థ ఉంది. అయినా సొంతంగా బ్యానర్ నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా జూబ్లీ హిల్స్‌లో కొత్త ఆఫీస్‌ను ప్రారంభించారు. అందులోనే కథలను వింటున్నారు. అంతేకాదు ఇదే తన బ్యానర్ ఆఫీస్ గా మార్చబోతున్నట్లు టాక్. తన బ్యానర్లో తక్కువ బడ్జెట్ తో రూపుదిద్దుకునే సినిమాలను నిర్మించనున్నట్లు తెలిసింది. మరి ఆ బ్యానర్ పేరేమిటి?, ముందుగా ఎవరితో సినిమా నిర్మిస్తారు? డైరక్టర్ ఎవరు అనే విషయాలు తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు.