‘పుష్ప: ది రైజ్’ రిలీజ్ అయిన వెంటనే.. టీమ్ చెప్పిన మాట ‘పుష్ప: ది రూల్’ త్వరలోనే ప్రారంభిస్తాం అని. అయితే ఏమైందో ఏమో.. ఇప్పటివరకు సినిమా షూటింగ్ పనులు మొదలవ్వలేదు. ఏమైంది.. ఏమైంది అని సోషల్ మీడియాలో అభిమానులు గగ్గోలు పెట్టినా టీమ్ నుండి ఎలాంటి స్పందన లేదు. అయితే తాజాగా సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. థాయ్‌లాండ్‌లో సినిమా షూటింగ్ మొదలుపెడతారట.
అదేంటి అల్లు స్టూడియోస్‌లో షూటింగ్ మొదలు అని ఆ మధ్య వార్తలొచ్చాయి కదా అంటారా? అవును అది నిజమే. కానీ ఇప్పుడు టీమ్ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటోందట. థాయిలాండ్ వెళ్లి అక్కడ ఫారెస్ట్ లో పులితో ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారని సమాచారం అందుతోంది. అయితే ఆ టీమ్‌లో అల్లు అర్జున్ ఉంటాడా? లేక కేవలం పులి సన్నివేశాలు మాత్రమే తీసి వస్తారా అనేది తెలియడం లేదు.
తెలుగు సినిమాల్లో పులితో హీరోలు ఫైట్ చేయడ కొత్తేమీ కాదు. అప్పట్లో ట్రైనింగ్ ఉన్న పులులతో ఫైట్లు చేసేవారు. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ వచ్చాక.. బొమ్మతో, ముసుగు మనుషులతో ఫైట్స్ చేసి.. వాటి స్థానంలో టెక్నాలజీతో పులిని తీసుకొచ్చేస్తున్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ వాడినా.. న్యాచురాలిటీ కావాలని సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్స్ వేస్తోందట. థాయ్ లాండ్ వెళ్లి అక్కడ పులికి సంబంధించిన క్లోజప్ షాట్స్ కొన్ని తీసి సినిమాలో వాడుకుందాం అని అనుకుంటున్నారట.
‘పుష్ప: ది రూల్’ ఎక్కువ శాతం అడవిలో సాగుతుందట. ఈ క్రమంలో పులి సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అందుకే ఒరిజినల్ పులి షాట్స్ కావాలని అనుకుంటున్నారట. దీంతో థాయ్‌లాండ్ పులి సన్నివేశాల చిత్రీకరణకు అల్లు అర్జున్ ఉంటాడా లేదా అనేది తెలియడం లేదు. అయితే ఆ టీమ్ అక్కడ పనులు చేసి వచ్చే లోపు ఇక్కడ అల్లు స్టూడియోలో సుకుమార్ బన్నీతో కొన్ని సీన్స్ తీస్తారని అంటున్నారు. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని టాక్. ఎందుకంటే అల్లు స్టూడియలో చిత్రీకరించబోయే తొలి సినిమా అదేమరి.