మెగాస్టార్ 151 వ చిత్రంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని తాజా సమాచారం. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించాడు. ఇక ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సంధర్బంగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ చిత్రానికి మొదట ఏ.ఆర్.రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాడు. దీంతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిను తీసుకున్నారు. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను కూడా ఈయనే సమకూరుస్తున్నాడు. అయితే అమిత్ పనితనం నచ్చి మెగాస్టార్ ఆయనకి ఓ గిఫ్ట్ ఇచ్చారట. అదేంటంటే.. ‘సైరా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిరు తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కూడా అమిత్ త్రివేదినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని మెగాస్టార్ భావిస్తున్నారట. ‘సైరా’ చిత్రానికి అమిత్ కంపోజ్ చేసిన పాటలకి, బి.జి.ఎం కు చిరు చాలా ఇంప్రెస్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అయితే దీనికి కొరటాల ఒప్పుకుంటాడా అనేది కూడా సందేహమే..! ఎందుకంటే కొరటాల ఇప్పటివరకూ తీసిన అన్ని సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నప్పుడే దేవి శ్రీ ని రెడీగా ఉండమని చెప్పాడట కొరటాల. మరి ఇలాంటి సందర్భంలో కొరటాల ఏం చేస్తాడో చూడాలి..!