దీపక్ ఇప్పటి యూత్ కి తెలిసుండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఇతను కూడా తెలుగులో లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగాడు. ఓ మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఇతని అసలు పేరు అర్జున్ బజ్వా. తర్వాత హిందీలో పలు పెద్ద సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ ఆశించిన స్థాయిలో అక్కడ క్లిక్ అవ్వలేదు. అయితే తెలుగు దీపక్ గా ‘సంపంగి’ అనే సినిమాతో డెబ్యూ ఇచ్చాడు.
‘పిట్టల దొర’ ‘జై భజరంగ బలి’ ‘బ్యాచిలర్స్’ వంటి సినిమాలు తీసిన సానా యాదిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. పెద్దగా అంచనాలు లేకుండానే ‘సంపంగి’ 2001 జూలై 13న రిలీజ్ అయ్యింది. మొదటి వారం థియేటర్లలో జనాలు లేరు. కానీ మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో రెండో వారం థియేటర్స్ పెరిగాయి. ఈ సినిమాకి సరిగ్గా వారం రోజుల ముందు అంటే జూలై 6న రాజశేఖర్ ‘సింహరాశి’ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ కూడా ఎక్కువగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది.
వి.సముద్ర ఆ చిత్రానికి దర్శకుడు. పక్కనే పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘సంపంగి’… ‘సింహరాశి’ పోటీని తట్టుకుని మరీ సూపర్ హిట్ అనిపించుకుంది. డెబ్యూ మూవీతోనే దీపక్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘ప్రేమలో పావని కళ్యాణ్’ ‘భద్ర’ ‘అరుంధతి’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. తర్వాత బాలకృష్ణ ‘మిత్రుడు’, నాగార్జున ‘కింగ్’ సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. కానీ అవి వర్కౌట్ కాలేదు. తర్వాత ఫేడౌట్ అయిపోయాడు. మొన్నామధ్య ‘బిగిల్’ సినిమాలో కనిపించినా ఇతనికి కలిసొచ్చింది ఏమీ లేదు.