‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) చేయబోయే సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) టైంలోనే ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ టీం.. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాని కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే ఊహించని విధంగా ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. అట్లీతో (Atlee Kumar) అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.
కొద్దిరోజుల నుండి ప్రచారం జరుగుతున్నట్టుగానే అల్లు అర్జున్ తన 22వ సినిమాని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.’సన్ పిక్చర్స్’ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించబోతోంది. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఓ కాన్సెప్ట్ వీడియో ద్వారా ఈ ప్రాజెక్టుని ఖరారు చేశారు. అల్లు అర్జున్ కెరీర్లో ఇది 22వ సినిమా అయితే దర్శకుడు అట్లీకి ఇది 6వ ప్రాజెక్టు. ఇక ఈ కాన్సెప్ట్ వీడియోలో సినిమా జోనర్ ఏంటి అన్నది హింట్ ఇచ్చారు.
‘మాస్ మీట్స్ మ్యాజిక్’ అంటూ ఈ వీడియోలో ఉంది. అట్లీ, అల్లు అర్జున్..లకి మాస్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా మాత్రం ‘యాక్షన్ అడ్వెంచర్’ జోనర్లో ఉండబోతుంది అని స్పష్టమవుతుంది. అందుకోసం దర్శకుడు అట్లీ ఓ కొత్త యూనివర్స్ ను కూడా క్రియేట్ చేస్తున్నాడు అని ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. సాయి అభ్యంకర్ ఈ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించినట్టు తెలుస్తుంది. మరి అతన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఖరారు చేస్తారా? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా మారింది.