బాహుబలి కంక్లూజన్ విడుదలై దాదాపు ఏడాది అవుతున్నా రికార్డులను నెలకొల్పుతూనే ఉంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ప్రభాస్ కలయికలో రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్ల మైలు రాయిని దాటి రికార్డు సృష్టించింది. కలక్షన్స్ మాత్రమే కాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో బాహుబలి-2ను ప్రత్యేకంగా షో వేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలి-2 స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. కొన్ని రోజుల కిందట రొమేనియాలో, మాస్కోలో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. రీసెంట్ గా పాకిస్థాన్ ఫిలిం ఫెస్టివల్ లోను షో వేసి రాజమౌళి ని సత్కరించారు.
అరుదైన గౌరవాలు, రికార్డులు అందుకున్న ఈ మూవీ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. జపాన్ దేశంలో వంద రోజులు ఆడిన తెలుగు చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. గతేడాది డిసెంబర్ 29న జపాన్ లో రిలీజైన ఈ చిత్రం థియేటర్లో 100 రోజులు రన్ పూర్తిచేసుకుని సుమారు 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ ను రాబట్టి ప్రస్తుతం 15 వ వారంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డ స్వయంగా తెలిపారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి… చరణ్, ఎన్టీఆర్ లతో ఒక మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.