తనకు అన్నం పెట్టడంతో పాటు జనం గుండెల్లో నిలబెట్టిన కళ పట్ల విధేయత చూపే నటీనటులు ఈ కాలంలో బహు అరుదు. కానీ వృత్తినే దైవంగా భావించి అంకిత భావంతో పనిచేసే అతికొద్ది మంది నటుల్లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధతను తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా అందుకున్న ఆయనకు సినిమా అంటే పంచ ప్రాణాలు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ అందరికీ పని కల్పిస్తున్నారు.
అద్భుతమైన నటనతో పాటు ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. మాస్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో ‘భైరవద్వీపం’లాంటి జానపద చిత్రానికి ఓకే చెప్పి ఆ రోజుల్లో ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశారు బాలయ్య. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుని కాసుల వర్షాన్ని కురిపించింది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. జానపద చిత్రంలో నటించడమే పెద్ద సాహసం అనుకుంటే, ఎంతో అందగాడైన బాలయ్య ఓ కురూపీ పాత్రకు నటించడం ఆయన ధైర్యానికి, కళ పట్ల ఆయనకున్న ప్రేమకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
అప్పటికే ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘నిప్పురవ్వ’, ‘బంగారు బుల్లోడు’ వంటి మాస్ కథా చిత్రాలతో దూకుడుమీదున్నారు బాలయ్య. అలాంటి సమయంలో కురూపీ పాత్ర చేయడానికి మరో హీరో అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాడేమో కానీ.. కానీ, బాలకృష్ణ అలా కాదు. దర్శకుడు, కథపై నమ్మకం వుంచి ఆయన సెట్‌లో దిగిపోయాడు.అంతా బాగానే వుంది కానీ.. కురూపి పాత్ర కోసం మేకప్ వేయడానికి అప్పట్లోనే దాదాపు 2 గంటల సమయం పట్టేది. ఒకసారి మేకప్ వేసిన తర్వాత సాయంత్రం దాకా తీయడానికి కుదరదు. ఇదే సమయంలో భోజనం చేయాలంటే మేకప్ తీసి..
ఆ తర్వాత మళ్లీ మొదటి నుంచి వేసుకురావాలి. దీనికి మరో రెండు గంటల సమయం వృథా అవుతుంది. నిర్మాతల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ .. కురూపీ పాత్రపై సన్నివేశాలు జరిగినన్ని రోజులు అంటే దాదాపు పదిరోజుల పాటు కేవలం జ్యూస్‌లు మాత్రమే తాగేవారట. ఈ విషయాన్ని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పలుమార్లు చెప్పారు. అంతటి సహనంతో అన్నీ భరించి.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు బాలయ్య.