బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఒక్కో విషయం తేలిపోతూ వస్తోంది. ఇలాంటి విషయాల్లో వచ్చిన పుకార్లు అన్నీ నిజం అవ్వాలని లేదు కానీ.. ఈసారి వచ్చిన అతి పెద్ద రూమర్ నిజమని తేలిపోయింది. అదే నటి హేమ ఆ రేవ్ పార్టీలో ఉన్నారని. అవును ఆమె అక్కడే ఉన్నారని బెంగళూరు పోలీసులు ఇప్పటికే కన్ఫామ్ చేసేశారు. అయితే ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నవారి జాబితాలో అంటే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో ఆమె ఉన్నారని తేల్చేశారు. బెంగళూరు ఇటీవల జరిగిన రేవ్ పార్టీలో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సిటీ క్రైమ్ కంట్రో బ్యూరో అధికారులు గురువారం తెలిపారు.
పార్టీకి హాజరైన 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చినవారిలో తెలుగు నటి హేమ, యువ నటి ఆశూ రాయ్ కూడా ఉన్నారని తెలిపారు. కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని నిందితులు అందరికీ నోటీలసుఉ పంపిస్తామని పోలీసులు పేర్కొన్నారు. రేవ్ పార్టీ జరిగిన ఫాం హౌస్ నుండి సుమారు 15.45 గ్రాముల ఎండీఎంఏ బిళ్లలు, సుమారు 6.2 గ్రాముల కొకైన్, సుమారు ఆరు గ్రాముల హైడ్రో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
వాటితోపాటు పదుల కొద్దీ సెల్‌ఫోన్లు, కార్లు సీజ్ చేసినట్లు కూడా సీసీబీ అధికారులు తెలియజేశారు. ఈ నెల 19న బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. డీజే సౌండ్‌ల కారణంగా స్థానికుల ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీ అని గుర్తించి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ లభ్యమయ్యాయి.
ఈ పార్టీలో తెలుగు రాష్టాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. అప్పుడే హేమ పేరు కూడా బయటకు వచ్చింది. అయితే నేను అక్కడ లేను అంటూ ఆమె ఇన్నాళ్లూ బుకాయించారు. సపోర్టింగ్‌గా వరుస వీడియోలు రిలీజ్ చేశారు. అయితే ఆమె అసలు పేరుతో ఆ పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది.