విశ్వక్ సేన్(Vishwak Sen)… ఇప్పుడున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోల్లో ఒకడు. ‘మంచి కథలు ఎంపిక చేసుకుంటాడు,టేస్ట్ ఉన్న హీరో’ అనే నమ్మకం సంపాదించుకున్నాడు. కచ్చితంగా ఆడియన్స్ కి నచ్చే విధంగా కొత్త కథలు అందిస్తాడు అనే పేరు కూడా ఇండస్ట్రీలో ఉంది. అయితే ఒక్కోసారి ఇతని మాటలు గమ్మత్తుగా ఉంటాయి. అందువల్ల ఇతన్ని ట్రోల్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. గతంలో ఇతను విజయ్ దేవరకొండ పై పరోక్షంగా సెటైర్లు వేసి..
వాళ్ళ అభిమానులకి టార్గెట్ అయ్యాడు. తర్వాత తన సినిమాలను ప్రమోట్ చేసుకునే క్రమంలో ఇతను చేసే పనులు కూడా వివాదాలకు దారి తీశాయి. ‘సరే ఇంతకీ ఇప్పుడేమైంది’ అనే విషయానికి వచ్చేద్దాం. మే 31 న విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీం ఓ ఫన్నీ ఇంటర్వ్యూలో పాల్గొంది. దీనిని యాంకర్ సుమ హోస్ట్ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ టాపిక్ వచ్చింది.
ఈ క్రమంలో సుమ.. ‘ఎన్టీఆర్ (Jr NTR) గారు మీరు మంచి స్నేహితులు కాబట్టి.. ‘ఎన్టీఆర్ సినిమాల్లో ఏదైనా రీమేక్ చేయాలి అనుకుంటే.. ఏ సినిమాను రీమేక్ చేస్తారు?’ అంటూ ప్రశ్నించింది. ఇందుకు విశ్వక్ సేన్.. ‘నా అల్లుడు’ అంటూ సమాధానం ఇచ్చాడు. ‘ఆ సినిమా బాగుంటుంది.. కొన్ని మార్పులతో రీమేక్ చేయొచ్చు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ సమాధానంకి సుమ (Suma Kanakala) సైతం షాక్ అయ్యింది.
‘నా అల్లుడు’ (Naa Alludu) అనే సినిమా ఎన్టీఆర్ కెరీర్లోని అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటి. ఆ సినిమా దర్శకుడు కూడా ఇప్పుడు అడ్రస్ లేడు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని పెద్దగా పట్టించుకోరు. ఏ సందర్భంలోనూ గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. అలాంటి సినిమా ఏ రకంగా విశ్వక్ సేన్ కి నచ్చిందో అతనికే తెలియాలి. మరోపక్క ‘విశ్వక్ సేన్ పరోక్షంగా ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తున్నాడా?’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.