2024 సంవత్సరం తమిళ సినిమాకి ఒక పీడ కల అని చెప్పొచ్చు. భారీ సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. పెద్ద హీరోలందరూ ఫ్లాప్ సినిమాలతో సైలెంట్ అయిపోయారు. అయితే.. యువ కథానాయకులు, దర్శకులు తమిళ సినిమాను కాపాడారు. ఈ ఏడాది హిట్ అయిన సినిమాలన్నీ చిన్న సినిమాలే కావడం విశేషం. మరి అవేంటో చూద్దాం..!!
గమనిక: ఈ లిస్ట్ లో సినిమాలు కేవలం కంటెంట్ క్వాలిటీ పరంగా మాత్రమే తీసుకోబడ్డవి. కమర్షియల్ హిట్స్ బట్టి కాదు.
1. బ్లూ స్టార్
కులం లేదా జాతిని బట్టి తక్కువ చేసి చూడడం లేదా వేరు చేయడం అనేది అనాదిగా వస్తున్న పనికిమాలిన ఆచారం. ఆ హెచ్చుతగ్గులు ఆటల విషయంలోనూ పాటిస్తుండడం అనేది సిగ్గు చేటు. ఈ విషయాన్ని కాస్త సీరియస్ టోన్ లో చెప్పిన కథ “బ్లూ స్టార్”. అశోక్ సెల్వన్, శాంతను భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఎస్.జయకుమార్ తెరకెక్కించాడు.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో
2. లవర్ (Lover)
మగాడు అదేదో హక్కులా గర్ల్ ఫ్రెండ్ లేదా భార్య మీద చెయ్యి చేసుకోవడం అనేది గ్లోరిఫై చేస్తున్న ఈ తరుణంలో.. ఆ గ్లొరిఫికేషన్ వెనుక దాగిన శాడిజాన్ని తెరపై ప్రెజంట్ చేసిన చిత్రం “లవర్”. టాక్సిక్ రిలేషన్ లో నుంచి బయటపడడం, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం అనేది ఎంత ముఖ్యం అనే విషయాన్ని వివరించి, చర్చించిన చిత్రమిది. తెలుగులో “ట్రూ లవర్”గా అనువాదరూపంలో విడుదలైంది. మణికందన్ (K. Manikandan) , గౌరీప్రియ (Sri Gouri Priya Reddy) నటన చాలా సహజంగా ఉంటాయి.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
3. హాట్ స్పాట్
సొసైటీలో జరుగుతున్న కొన్ని విషయాలు విని, చదివి, చూసి ఒక్కోసారి అవ్వక్కవుతుంటాయి. కొన్ని విషయాలు తెలిశాక కనీసం మాట్లాడడానికి క్దుఆ ఇబ్బందిపడిపోతుంటాం. నాలుగు వైవిధ్య రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ను దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్ ప్రెజంట్ చేసిన తీరు షాక్ కు గురి చేయడం ఖాయం. అలాగే.. చర్చించిన అంశాలు కూడా బలమైన ఆలోచనను ప్రేరేపిస్తాయి.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ఆహా
4. గరుడన్ (Garudan)
ఒక రెగ్యులర్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం “గరుడన్”. అయితే.. స్నేహం, వెన్నుపోటు, నమ్మకం వంటి అంశాలను డీల్ చేసిన విధానం ఈ చిత్రాన్ని హిట్ చేసింది. ముఖ్యంగా.. సూరి (Soori Muthusamy) నటన భలే ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో “భైరవం” అనే టైటిల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) , నారా రోహిత్ (Nara Rohith) , మంచు మనోజ్ తో (Manchu Manoj) రీమేక్ చేస్తున్నారు.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో
5. మహారాజా (Maharaja)
ఈ ఏడాది విడుదలైన ఇండియన్ మూవీస్ లో కంటెంట్ పరంగా టాప్ లో ఉంటుంది “మహారాజా”. స్క్రీన్ ప్లే విషయంలో ఈ చిత్రం ఓ టెక్స్ట్ బుక్ లాంటిది. చాలా సెన్సిబుల్ అంశాన్ని ఎంతో నేర్పుతో దర్శకుడు నితిలన్ (Nithilan Saminathan) తెరకెక్కించిన తీరు అభినందనీయం. ఇక విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటన, అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్
6. డీమాంటే కాలనీ 2 (Demonte Colony)
నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేవు. కానీ.. విడుదలయ్యాక అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా.. సినిమాలోని హారర్ ఎపిసోడ్స్ కంపోజిషన్ థ్రిల్లింగ్ గా ఉండడం అనేది మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. అజయ్ జ్ఞానముత్తు (R. Ajay Gnanamuthu) టేకింగ్.. దానికి ప్రియభవానీ శంకర్ (Priya Bhavani Shankar) & అరుల్ నిధి (Arulnithi) సపోర్ట్ మంచి అవుట్ పుట్ ఇచ్చాయి.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: జీ5
7. తంగలాన్ (Thangalaan)
వందల ఏళ్లపాటు మనుషుల మీద జరిగిన జాత్యహంకార హింసను తెరకెక్కించడంలో పా.రంజిత్ (Pa. Ranjith) శైలి వేరు. విక్రమ్ (Vikram) ప్రధాన పాత్రలో రూపొందిన “తంగలాన్” అదే టైటిల్ తో అన్ని భాషల్లోనూ విడుదలైనప్పటికీ.. సినిమాలోని కంటెంట్ ను జనాలు అర్థం చేసుకున్న తీరు పా.రంజిత్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. మాళవిక మోహనన్ కూడా నటించగలదు అని ప్రూవ్ చేసిన సినిమా ఇది.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్
8. కొట్టుక్కళి (Kottukkaali)
కొన్ని సినిమాలు డైరెక్ట్ మెసేజీలు ఇవ్వవు. కానీ.. సినిమాని అర్థం చేసుకునే కొద్దీ దాని లోతు అర్థమై, అనంతరం బాగా డిస్టర్బ్ చేస్తుంది. “కొట్టుక్కళి” ఆ తరహా చిత్రమే. ఒక అమ్మాయిని సమాజం ఎలా ట్రీట్ చేస్తుంది, ఆమె మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంలో మగాళ్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అనే విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్పిన సినిమా ఇది. మలయాళ నటి అన్నా బెన్ (Anna Ben) & సూరి (Soori Muthusamy) నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో
9. వాళై (Vaazhai)
చిన్న పిల్లల మనసు ఒక తెల్లటి కాగితం లాంటిది, వారి మనసు చాలా స్వచ్ఛమైనది. చిన్నప్పుడు వాళ్లు చూసే సంఘటనలు, ఎదుర్కొనే పరిస్థితులు వాళ్ల ఎదుగుదలలో, ముఖ్యంగా వారి ప్రవర్తనలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ విషయాన్ని ఎంతో హృద్యంగా, చివర్లో కాస్త భయపెడుతూ దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) తెరకెక్కించిన చిత్రం “వాళై”.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
10. లబ్బర్ పందు
ఈగో అనేది ఇద్దరు మనుషుల మధ్య ఎంత దూరం పెంచుతుంది అనే పాయింట్ తో క్రికెట్ ను కోర్ పాయింట్ గా పెట్టుకుని దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు తెరకెక్కించిన చిత్రం “లబ్బర్ పందు”. హరీష్ కళ్యాణ్, అట్టకత్తి దినేష్, శ్వాసిక నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
11. మెయిళగన్ (Meiyazhagan)
కొన్ని సినిమా చూస్తున్నప్పుడు సడన్ గా శుభం కార్డ్ పడేసరికి ఏంటి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఎలాంటి అతి లేకుండా, చుక్క రక్తం చిందించకుండా, కేవలం ఇద్దరు మగాళ్లు ఆనందభాష్పాలు కారుస్తూ మాట్లాడుకునే సందర్భాలు ఎంత ముచ్చటగా ఉంటాయో. వెంటనే మన క్లోజ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడాలి అనిపిస్తుంది. ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) దర్శకత్వం, కార్తీ (Karthi) & అరవిందస్వామి (Arvind Swamy) నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక గోవింద్ వసంత (Govind Vasantha) సంగీతం మనసుల్ని హత్తుకుంటుంది.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్
12. బ్లాక్ సైన్స్ ఫిక్షన్
కథలకు మన భారతీయ ప్రేక్షకులు, ఫిలిం మేకర్స్ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధమవ్వలేదు. అందుకే హాలీవుడ్ లో వచ్చే ఆ తరహా సినిమాల మీద తెగ మోజు ఉంటుంది మనోళ్ళకి. ఆ దిశగా ఒక అడుగు వేస్తూ కె.జి.బాలసుబ్రమణి తెరకెక్కించిన చిత్రం “బ్లాక్”. టైమ్ లైన్స్, వార్మ్ హోల్ కాన్సెప్ట్స్ మీద బేస్ చేసుకుని వీలైంతవరకు ఆడియన్స్ కు సింపుల్ గానే చెప్పిన కథ ఇది. సైన్స్ ఫిక్షన్ కథలంటే ఇష్టపడేవాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో
13. అమరన్ (Amaran)
యుద్ధభూమిలో ప్రాణాలు విడిచిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన చిత్రం “అమరన్”. శివకార్తికేయన్ (Sivakarthikeyan) టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో సాయిపల్లవి (Sai Pallavi) మరో కీలకపాత్ర పోషించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించడం అనేది కేవలం సాయిపల్లవి స్టార్ డమ్ వల్లే సాధ్యపడింది అనే విషయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్
14. బ్లడీ బెగ్గర్ (Bloody Beggar)
సినిమాలో ఎంత మంచి మెసేజ్ ఉన్నా.. ఆ మెసేజ్ ను అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోతే కష్టం. “బ్లడీ బెగ్గర్” విషయంలో అదే జరిగింది. డార్క్ హ్యూమర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కర్మ అనే కాన్సెప్ట్ ను కొత్తగా ఎలివేట్ చేసిన విధానం బాగుంది. అయితే.. క్లారిటీ లోపించడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది కానీ, ఓటీటీలో ఆడియన్స్ ను మాత్రం అలరిస్తోంది. కవిన్ (Kavin Raj) నటన & ఎమోషనల్ బ్లాక్ ఆకట్టుకుంటాయి.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: ప్రైమ్ వీడియో
15. విడుదల-2 (Vidudala Part 2)
కొన్ని సినిమాలు మన అస్తిత్వాన్ని ప్రశ్నించుకునేలా చేస్తాయి. మనల్ని మనం ప్రశ్నించుకోవడమే కాదు, చుట్టూ పరిస్థితుల్ని, సమాజాన్ని సైతం ప్రశ్నించాలి అనే ఆలోచనను మన మెదడులో సృష్టిస్తుంది. వెట్రిమారన్ టేకింగ్, డైలాగ్స్ & విజయ్ సేతుపతి యాక్టింగ్ & ఇళయరాజా నేపథ్య సంగీతం కచ్చితంగా అలరిస్తాయి. జనవరి రెండో వారం నుండి ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే వెర్షన్ లో ఒక గంట ఫుటేజ్ ఎక్స్ట్రా ఉండబోతోందని వినికిడి.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్: జీ5