అనుకున్నట్లు గా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సాగడం లేదు. ఎదో ఒక అవాంతరం కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోతుంది. భారీ చిత్రం కావడంతో, వందల మంది టీమ్ పాల్గొనాల్సి వుండడడంతో షూటింగ్ షెడ్యూల్స్ వాయిదాపడడం దర్శకుడు రాజమౌళికి అలాగే నిర్మాత దానయ్యకు తలనొప్పిగా మారింది. గత ఏడాది అనేక కారణాల చేత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అనుకున్నట్లుగా ముందుకు సాగలేదు. ఆ కారణంగానే జులై 30, 2020 న రావాల్సిన ఈ చిత్రాన్ని 2021 జనవరి 8కి వాయిదా వేశారు. గత ఏడాది ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లకు గాయాలు కావడం, రాజమౌళి కుమారుడు పెళ్లి, ఇలా అనేక కారణాల చేత షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడైనా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ పెద్ద దెబ్బే వేసింది. దీనితో మళ్ళీ ఎప్పుడు పూర్తి స్థాయిలో షూటింగ్ మొదలవుతుందనే అనుమానాలు మొదలయ్యాయి.
కాగా రాజమౌళి మాత్రం తన ఆలోచనలలో తను ఉన్నారట. నెక్స్ట్ షెడ్యూల్ నుండి ఎన్టీఆర్, చరణ్ నిరంతరం అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇచ్చారట. ఐతే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మూవీ ఒప్పుకొని వున్నారు. ఈ మూవీ షూటింగ్ మే నుండి మొదలుకానుంది. కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్స్ షెడ్యూల్స్ లో మార్పు వచ్చిన నేపథ్యంలో త్రివిక్రమ్ మూవీ కొరకు ఎన్టీఆర్ ఇచ్చిన డేట్స్ కూడా మారిపోయే అవకాశం కలదు. రెండు సినిమాలలో ఏక కాలంలో నటించాలన్న ఎన్టీఆర్ నిర్ణయం ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ మూవీ మరియు ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్స్ ని బ్యాలన్స్ చేయడమే ప్రస్తుతం ఎన్టీఆర్ ముందున్న సవాల్.