పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ ‘వకీల్ సాబ్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు ఇది రీమేక్. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. చెప్పాలంటే వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసినవి రెండే రెండు సినిమాలు. ఒకటి ‘ఓ మై ఫ్రెండ్’ రెండు ‘ఎం.సి.ఎ’. మొదటి చిత్రం యావరేజ్ కాగా.. రెండోది సూపర్ హిట్ అయ్యింది. కేవలం రెండు సినిమాలకే పవన్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ లభించింది కాబట్టి అంతా.. వేణు శ్రీరామ్ అదృష్టవంతుడు అని అనుకుంటున్నారు. కానీ ఈయన జీవితంలో చాలా ట్రాజెడీ ఉందట.
అదేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి. వేణు శ్రీరామ్ మాట్లాడుతూ.. ” ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రం వల్ల నాకు కలిసొచ్చిందేమీ లేదు. ఆ చిత్రం రిలీజ్ రోజునే మా అమ్మానాన్నలతో పాటు నా కుటుంబ సభ్యులందరితో కలిసి ఆ సినిమా చూశాను. కానీ ఆ ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. ‘ఓ మై ఫ్రెండ్’ సినిమా ఫలితం గురించి కాదు నా బాద. అసలు ఆ సినిమా ఫైనల్ రిజల్ట్ ఏంటో కూడా నేను పట్టించుకోలేదు. అసలు విషయం ఏంటంటే.. ఆ చిత్రం విడుదలైన తర్వాతి రోజే మా నాన్న గారు మమ్మల్ని విడచి వెళ్లిపోయారు. మా సొంత ఊర్లో ఇంటి నిర్మాణం పనుల్లో ఉన్నప్పుడు.. మా నాన్న గారు పై అంతస్థు నుండీ ప్రమాద వశాత్తూ కింద పడి ప్రాణాలు కోల్పోయారు.
అది నా జీవితంలో అతి పెద్ద విషాద సంఘటన. ఆ విషాదం నుండీ కోలుకోవడానికి నెల పైనే పట్టింది. అలాంటి టైములో ‘ఓ మై ఫ్రెండ్’ ఫలితమేంటి.. ఆ సినిమా ఎలా ఆడుతోంది.. అన్నది కూడా నేను తెలుసుకోలేదు. చివరికి ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు అని తెలిసింది. మా నాన్నగారిని కోల్పోవడం వల్ల నా సంతోషాలన్నీ దూరమైపోయాయి. ‘మొదటి చిత్రం సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత ఓ స్టార్ హీరోతో సినిమా మొదలైనట్లే మొదలై ఆగిపోయింది. ఆ టైములో స్టార్ల కోసం కథలు రాస్తే ఏవీ వర్కవుట్ కాలేదు. చిన్న హీరోలను సంప్రదించినా వాళ్ళు కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ కారణంగా ఏడేళ్లు గ్యాప్ వచ్చింది. చివరికి నాని ‘ఎం.సి.ఎ’ సినిమా చేసే అవకాశం దక్కింది. ఆ చిత్రం హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో నిలదొక్కగలిగాను” అంటూ చెప్పుకొచ్చాడు.