సినిమాకు హైప్ పెంచడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసోడు ఎక్కడైనా, ఏ ఇండస్ట్రీని అయినా ఏలేస్తాడు అని అంటారు. అయితే ఆ పెంచితన హైప్‌ను అంతే స్థాయిలో అందుకోవాలి. లేదంటే నానా ఇబ్బందులు పడతారు. తాజాగా ఇలాంటి హైప్‌ను పెంచే పనిలోనే ఉన్నారు కొరటాల శివ. చాలా కాలంగా ఎన్టీఆర్ సినిమా మీద కుస్తీ పడుతున్న కొరటాల శివ తాజాగా పాత్రల ఫైనలైజ్ దగ్గరకు వచ్చారట. ఈ క్రమంలో ఆయన ఆలోచనలు, మాటలు బాలీవుడ్‌వైపు, బాలీవుడ్‌తోనే ఉన్నాయి అంటున్నారు.
ఎందుకంటే కీలక పాత్రలకు తారక్‌తోపాటు బాలీవుడ్ జనాలు ఉంటేనే బాగుంటుంది. వీలైతే సౌత్ నుండి కొంతమంది స్టార్లు, కీలక నటులను తీసుకుందాం అనుకుంటున్నారట. వినడానికి ఈ విషయం కొత్తగ లేకపోవచ్చు కానీ.. ఎందుకు అంతగా బాలీవుడ్ జనాల మీద ఆధారపడటం అనే విమర్శ మాత్రం వస్తోంది. ఏడాది నుండి సాగుతూ వస్తున్న తారక్ సినిమా వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని సమాచారం. అమావాస్య తర్వాత అంటే 20వ తేదీ తర్వాత ఈ సినిమా ప్రారంభిస్తారని సమాచారం.
దీంతో ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయంలో చర్చలు, మొత్తాలు, లెక్కలు తేలిపోతున్నాయట. ఈ క్రమంలో సినిమాలో ప్రధాన విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను ఎంచుకున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్‌తో పోటీకి దిగాడు సైఫ్. ఇప్పుడు తారక్‌తో కూడా అదే పని చేయబోతున్నాడని సమాచారం. త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఇక హీరోయిన్‌గా జాన్వీ కపూర్ అని చాలా రోజులుగా పేరు వినిపిస్తోంది.
ఇదంతా చూస్తుంటే ఈ సినిమాలో కచ్చితంగా బాలీవుడ్ వాసన గుప్పున కొట్టాలని కొరటాల అండ్ కో. అనుకుంటున్న అర్థమైపోతోంది. వారితోపాటు కాస్త సౌత్ స్మెల్ కూడా వచ్చేలా ఆలోచనలు చేస్తున్నారట. అయితే నేల విడిచి సాము చేయకుండా ఉంటే మంచింది. ఎందుకంటే పాత్రధారి కంటే పాత్ర ముఖ్యం అని ఆయనకు ‘ఆచార్య’ ఓ పాఠం నేర్పింది.