‘మేం అంతా రెడీగా ఉన్నాం.. కానీ మరో హీరో సినిమా కోసం మా హీరో మాట మేరకు సినిమాను ఆపేశాం’.. ‘అఖండ 2: తాండవం’ సినిమాకు సంబంధించిన ఇటీవల సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను చేసిన కామెంట్స్ ఇవి. ఆ మరో హీరో సినిమా ఏంటో మీకు తెలిసే ఉంటుంది. అవును మీరు అనుకున్నదే ‘ఓజీ’. ఈ సినిమాలు రెండూ ఒకే తేదీన అంటే సెప్టెంబరు 25 విడుదల కావాల్సి ఉంది. కానీ ఆఖరులో ‘అఖండ 2: తాండవం’ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. దీనికి కారణం అప్పట్లో ఒకట్రెండు వినిపించాయి. అయితే ఇప్పుడు దర్శకుడు బోయపాటి దాని వెనుక ఒకటే కారణం ఉందని చెబుతున్నారు.
‘అఖండ 2: తాండవం’ సినిమా వచ్చిన సందర్భంగతా బోయపాటి వరుసగా మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో సెప్టెంబరు 25న రావాల్సిన సినిమా రాకపోవడానికి గల కారణాన్ని బోయపాటి చెప్పారు. తమ సినిమా అప్పటికే సిద్ధమైందని, విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కానీ.. ‘ఓజీ’ సినిమా కోసం ఆగిపోయామని క్లారిటీ ఇచ్చేశారు. మా సినిమా షూటింగ్ డిసెంబరులో మొదలు పెట్టి జూన్ చివరికల్లా పూర్తి చేశామని తెలిపారు.

జార్జియాలో సినిమాలో క్లైమాక్స్ షూట్ చేసుకుని వచ్చి… ఆగస్టు 10 కల్లా రీ రికార్డింగ్ చేసేశాం. అయితే.. ఈలోపు మేం అనుకున్న తేదీకి ‘ఓజీ’ వస్తోందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒకరి మీద ఒకరు పడడం ఎందుకు అనుకున్నాం. ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబమని, అందరూ బాగుండాలని అనుకున్నాం. బాలయ్య కూడా తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమా ‘ఓజీ’కి దారి ఇద్దాం అని అన్నారు. దాంతో మేం తర్వాత వద్దాం అనుకున్నాం అని బోయపాటి క్లారిటీ ఇచ్చారు.
‘అఖండ’ సినిమా డిసెంబర్ 2న వచ్చింది.. ఈసారి డిసెంబర్ 5న వద్దాం అని బాలయ్య చెప్పారు.. దీంతో ‘ఓజీ’కి సోలో రిలీజ్ వచ్చేలా మేం ఆగిపోయాం అని బోయపాటి చెప్పారు. అలా తమ్ముడు పవన్ కోసం అన్న బాలయ్య ఆగిపోయాడని చెప్పొచ్చు.
