మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను.. పాత కమర్షియల్ కథనే తీసుకున్నప్పటికీ దాన్ని కొత్తగా చూపించి హిట్ అందుకుంటూ ఉంటారు. అలాగే ఇతని సినిమాలో ఎక్కువమంది స్టార్ నటీనటులు ఉండేలా చూసుకుంటారు. మరో విశేషం ఏమిటంటే హీరోలను విలన్స్ గా చూపిస్తుంటారు. జగపతి బాబు, ఆదిలు బోయపాటి సినిమాలో విలన్స్ గా చేసి బిజీ అయిపోయారు. తాజాగా బోయపాటి మరో అలవాటు చేసుకున్నారు. హీరోయిన్స్ ని ఐటెం భామలుగా చేసేస్తున్నారు. సింహా సినిమాలో నమితతో ఐటెం సాంగ్ చేయించిన బోయపాటి.. లెజెండ్ లో హంసానందినితో లస్కుటపా అనిపించారు. ఇక సరైనోడులో అంజలిని, జయజానకి నాయకిలో కేథరిన్ ని ప్రత్యేక పాటలో అందాలు ఆరబోయించారు.
ఇప్పుడు తాను రామ్ చరణ్ తేజ్ తో చేస్తున్న సినిమాకోసం ఐటెం సాంగ్ చేసే హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఈ నెల ఆఖరి వారంలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. హీరోయిన్ గా కైరా అద్వానీ ఫిక్స్ అయింది. చరణ్ కి వదినలుగా నటించనున్నవారు కూడా ఖరారు అయ్యారు. ఇక ఐటెం సాంగ్ చేయడానికి ఏ హీరోయిన్ ముందుకు వస్తారో చూడాలి. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంతో రామ్ చరణ్ ని ఫుల్ మాస్ హీరోగా బోయపాటి చూపించబోతున్నారు.