సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఇటీవల చేసిన కామెంట్స్ అందరూ వినే ఉంటారు. ‘ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి వాళ్ళు.. ఏనాడు కూడా తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడింది లేదు. కానీ ఇప్పటి హీరోలు మాత్రం రోజుకు రూ.2 కోట్లు, రూ.6 కోట్లు తీసుకుంటున్నాం.. 40 కోట్లు.. 50 కోట్లు అని పబ్లిక్ గా చెబుతున్నారు.సీనియర్ ఎన్టీఆర్ తన పారితోషికం గురించి ఏనాడూ బయట మాట్లాడలేదు.
జూనియర్ ఆర్టిస్ట్ లు ఎంతమంది రోజుకు రెండు పూటలా తింటున్నారో మా అసోసియేషన్ వారు పరిశీలించాలి’ అంటూ కోటా చెప్పుకొచ్చారు. ఆయన చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అది నిజమైనా కాకపోయినా కోటా శ్రీనివాసరావు వంటి పెద్ద నటులు అలా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదనే చెప్పాలి. అంతేకాకుండా ఆయన ఇప్పటి నటీనటుల గురించి, సినిమాల గురించి చాల ఘోరంగా కూడా మాట్లాడారు.
ఇప్పట్లో సినిమా అనేది లేదు అంతా సర్కస్ అంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. కోటా కామెంట్స్ పై ఇటీవల బ్రహ్మానందం పరోక్షంగా కామెంట్లు చేశారు. ‘అన్ స్టాపబుల్’ సినిమా ట్రైలర్ లాంచ్ కు గెస్ట్ గా వచ్చిన ఆయన ప్రెజెంట్ జనరేషన్ హీరోలను, కమెడియన్లను ఆశీర్వదించారు. తర్వాత ‘పెద్దలమైన మేము.. పెద్దరికం అంటే ఏజ్లో..! మేము ఇప్పటి హీరోలను, కమెడియన్లను ఆశీర్వదించాలి.
అంతేగాని ‘వాడి కామెడీ ఏంటి, అసలు సినిమా ఏంటి?’ అంటూ నెగిటివ్ కామెంట్లు చేయకూడదు. మూసుకుని కూర్చోవాలి… అది చేత కాకపోతే అక్కడి నుండి లేచి వెళ్ళిపోవాలి. అంతేకానీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడకూడదు. ఈ మధ్యన నేను కూడా కొన్ని చూశాను. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ‘ అంటూ (Brahmanandam) బ్రహ్మానందం .. పరోక్షంగా కోటా పై సెటైర్లు వేశారు.