ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ 2009 లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా లైమ్ లైట్ లోకి రావడానికి కొంత టైమ్ పట్టింది. 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోల చూపుని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత కూడా ఎత్తుపల్లాలు చూసింది. గత ఏడాది మాత్రం నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ఈ ఏడాది అందరి మదిలో నిలిచి పోయే పాత్ర పోషిస్తోంది. అదే భ్రమరాంబ. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా నటించింది. ఇందులో మొదటి నుంచి చివరకు.. పాటల్లో సైతం అన్ని సాంప్రదాయ దుస్తుల్లోనే నటించి ఆకట్టుకుంటోంది. ఆ పాత్రను డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ మలిచిన తీరుకూడా వైవిధ్యంగా ఉంది. “మంచితనం, మొండితనం, పిచ్చితనం, పెంకితనం, అన్ని కలిపి మిక్సీ లో వేసి కొడితే నువ్వు” అంటూ హీరో చేత భ్రమరాంబ గురించి సింగిల్ డైలాగులో చెప్పించారు.
సండే బోర్ గా ఉందని బాయ్ ఫ్రెండ్ ని పిలిచి ఆ విషయాన్నీ అతనితో చెప్పే మంచితనం.. “వాడు నాకు కావాలి నాన్నా” అంటూ నాన్నతో చెప్పేంత మొండితనం, మనసు ఇచ్చిన వాడితో “అంటే నా కన్నా మీ నాన్నే ఎక్కువైపోయారా ?” అని అడిగే పిచ్చితనం.. “ఎక్కువ ఫోజులు కొడుతున్నాడు” అని ఎగతాళి చేసే పెంకితనం .. అన్ని భ్రమరాంబలో ఉన్నాయి. అంతేకాదు సరదగా ఉంటూ కన్నీరు తెప్పిస్తుంది. అందుకే హీరో “రోజుకో అవతారం చూపిస్తున్నావు” అంటూ కౌంటర్ వేస్తాడు. ఇన్ని వెరియేషన్లు ఉన్నాయి కాబట్టే భ్రమరాంబ రకుల్ కి విజయంతో పాటు మంచి పేరుని తెచ్చి పెట్టనుంది. ఆ భ్రమరాంబ అందం, అభినయం చూడాలంటే ఈనెల 26 వరకు ఆగాలి. అప్పుడే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా థియేటర్లలోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.