బాహుబలి చిత్రాలతో రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయింది. తమతో సినిమా చేయమని బాలీవుడ్ నిర్మాతలు క్యూ కట్టారు. కానీ దర్శకధీరుడు తెలుగులో సినిమాని తీయడానికే మొగ్గుచూపారు. గ్రాఫిక్స్ జోలికి వెళ్లకుండా కేవలం ఓ కుటుంబ కథ చిత్రాన్ని తీయడానికి సిద్ధమయ్యారు. అందులో హీరోగా నటించేవారు ఎన్టీఆర్, రామ్ చరణ్ అని నోటితో చెప్పకపోయినా ఫోటోతో చెప్పి అందరినీ ఊరించారు. చెర్రీ, తారక్ లతో ఇదివరకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. వారి ఇద్దరినీ ఒకే చిత్రంలో చూపిస్తే ఆ సినిమా ఏ రేంజ్ లో కలక్షన్స్ సాధిస్తుందో .. ఇప్పుడే అంచనా వేయలేము. అసలు మెగా, నందమూరి హీరోల కలయికే ఓ క్రేజీ థింగ్.
అటువంటిది రాజమౌళి డైరెక్ట్ చేస్తుంటే.. ఆ ప్రాజక్ట్ పై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు మించి సినిమా ఉండాలని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా కోసం 150 కోట్లు బడ్జెట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. సో కలక్షన్స్ పెరగాలని ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో రిలీజ్ చేస్తారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.