సూర్య వశిష్ఠ, ప్రేమ్ సాగర్, నవ్యా స్వామి తదితరులు.. (Cast)
శౌరీ చంద్రశేఖర్ టి.రమేష్ (Director)
నాగవంశీ-సాయి సౌజన్య (Producer)
గోపీ సుందర్ (Music)
వంశీ పచ్చిపులుసు (Cinematography)
Release Date : ఫిబ్రవరి 04, 2023
2020లో మలయాళంలో రూపొందిన “కప్పెల”కు రీమేక్ గా తెలుగులో తెరకెక్కిన చిత్రం “బుట్టబొమ్మ”. “ఎంతవాడు గానీ, విశ్వాసం” చిత్రాల్లో అజిత్ కుమార్తెగా నటించి విశేషమైన పాపులారిటీ సంపాదించుకున్న అనిక సురేంద్రన్ మొట్టమొదటిసారి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మీద మంచి బజ్ ఉంది. మరి ఈ మలయాళ రీమేక్ తెలుగులో ఏమేరకు వర్కవుటయ్యిందో చూద్దాం..!!
కథ: ఓ సాధారణ కుటుంబానికి చెందిన పల్లెపడుచు సత్య (అనిక సురేంద్రన్). తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణలో చాలా ఒద్దికగా పెరుగుతుంది. అనుకోని విధంగా మురళి (సూర్య వశిష్ట)తో పరిచయం జరిగి, ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆటో డ్రైవర్ మురళిని ఏకాంతంగా కలవడం కోసం అరకు నుంచి వైజాగ్ వస్తుంది సత్య.
సరిగ్గా అదే టైంలో సత్య & మురళిల లవ్ స్టోరీలోకి ఎంటరవుతాడు ఆర్కే (అర్జున్ దాస్). ఈ కథలో హీరో ఎవరు? విలన్ ఎవరు? సత్య జీవితం ఈ ఇద్దరి కారణంగా ఎలాంటి మలుపులు తిరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “బుట్టబొమ్మ” చిత్రం.
నటీనటుల పనితీరు: ఆల్రెడీ నటిగా చిన్నప్పుడే ప్రూవ్ చేసుకున్న అనిక సురేంద్రన్, ఈ చిత్రంలో సత్య అనే పల్లెపడుచుగా ఒదిగిపోయింది. డబ్బింగ్ కొన్ని సన్నివేశాల్లో సింక్ అవ్వలేదు కానీ, నటిగా ఆమె స్క్రీన్ ప్రెజన్స్ మాత్రం సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా తొలిసారి ప్రేమలో పడిన యువతిగా ఆమె హావభావాలు యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి.
“ఖైదీ, మాస్టర్, అంధగారం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్ దాస్ ఈ చిత్రంలో కోపోద్రిక్తుడైన ఆర్కే పాత్రలో తన వాయిస్ & నటనతో అలరించాడు. తెలుగులో తన క్యారెక్టర్ కు ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం పాత్రకు మంచి వేల్యూ యాడ్ చేసింది. సూర్య వశిష్ట కూడా ఆటోడ్రైవర్ గా పర్వాలేదనిపించుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు: గోపీసుందర్ మ్యూజిక్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. పచ్చిపులుసు వంశీ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది, అరకు అందాలను కొత్త కోణంలో చూపించారు. లిమిటెడ్ స్పేస్ లోనూ డిఫరెంట్ యాంగిల్స్ తో రిపిటీషన్ లేకుండా చేసిన విధానం ప్రశంసనీయం. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.
దర్శకుడు చంద్రశేఖర్ టి.రమేష్ తెలుగు వెర్షన్ కథకు చేసిన మార్పులు బాగున్నాయి. ముఖ్యంగా ఓపెనింగ్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన విధానం.. నేటివిటీకి ఆడియన్స్ ను కనెక్ట్ చేయడంలో బాగా ఉపయోగపడింది. కాకపోతే.. క్యారెక్టర్స్ మధ్య టెన్షన్ ను క్రియేట్ చేయడంలో కాస్త తడవడ్డాడు దర్శకుడు. గణేష్ రావూరి మాటలు కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి.
విశ్లేషణ: ఒటీటీల పుణ్యమా అని నెట్ ఫ్లిక్స్ లో ఒరిజినల్ వెర్షన్ చూడకుంటే మాత్రం “బుట్టబొమ్మ” ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అనిక, అర్జున్ దాస్ ల నటన, గోపీసుందర్ నేపధ్య సంగీతం కోసం ఈ సినిమాను ఒకసారి కచ్చితంగా చూడొచ్చు!