విశాల్ నిర్మిస్తూ నటించిన తాజా చిత్రం “చక్ర”. విశాల్ మునుపటి చిత్రమైన “అభిమన్యుడు” సూపర్ హిట్ అవ్వడంతో అదే నేపధ్యంలో “చక్ర” కూడా తెరకెక్కింది. రెజీనా ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయడం విశేషం. మరి ఈ చక్ర కూడా అభిమన్యుడు స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!
కథ: ఆగస్ట్ 15న ఇద్దరు దొంగలు హైద్రాబాద్ లో సీనియర్ సిటిజన్స్ ఉంటున్న ఇళ్లను టార్గెట్ చేసి ఒకేసారి 50 ఇళ్ళలో దొంగతనం చేస్తారు. దాదాపు 7 కోట్ల రూపాయల చోరీ జరుగుతుంది. అదే చోరీలో సుభాష్ చంద్రబోస్ (విశాల్) ఇంట్లో తండ్రికి చెందిన వీర చక్ర అవార్డ్ ను కూడా దొంగిలిస్తారు. ఇది సాధారణ దొంగతనం కాదని, ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం చేశారని, దీని వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం కూడా ఉందని భావిస్తుంది. దాంతో హైద్రాబాద్ ఏసీపీ గాయత్రి (శ్రద్ధ శ్రీనాథ్) తోపాటు మిలటరీ ఇంటెలిజెన్స్ లో వర్క్ చేస్తున్న చంద్రు (విశాల్) కూడా రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ దొంగతనాల వెనుక ఉన్నది ఎవరు? వాళ్ళను చంద్రు-గాయత్రి ఎలా ఎదుర్కొన్నారు? అనేది “చక్ర” కథాంశం.
నటీనటుల పనితీరు: విశాల్ కి చంద్రు పాత్ర కొట్టిన పిండి. ఇదివరకు విశాల్ కనీసం ఒక అయిదారు సినిమాల్లో ఇలాంటి పాత్ర పోషించి ఉంటాడు. అందువల్ల ఎఫర్ట్ లెస్ గా కనిపిస్తాడు ఈ చిత్రంలో. అయితే.. ఎంత మిలటరీ ఆఫీసర్ అయితే మాత్రం ప్రతి సన్నివేశంలో మిలటరీ ఫ్యాంట్ లేదా టీషర్ట్ వేసుకొని ప్రతి ఫ్రేమ్ లో “నేను మిలటరీ” అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించడం అనవసరం అనిపిస్తుంటుంది. శ్రద్ధా శ్రీనాధ్ పోలీస్ పాత్రకు యాప్ట్ అవ్వలేదు. బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ, ఫిజిక్ పరంగా కానీ టైట్ టీషర్ట్స్ వేసి ఏదో కవర్ చేయడానికి ప్రయత్నించారు కానీ.. పోలీస్ అనే ఫీల్ ఎక్కడా కనిపించలేదు.
రెజీనా నెగిటివ్ రోల్లో ఆకట్టుకుంది. అయితే.. ఆమె పాత్రను డిజైన్ చేసిన విధానం, ఎండ్ చేసిన తీరు బాగోలేదు. అందువల్ల ఆమె పాత్రకు ఓపెనింగ్లో ఉన్న ఇంపాక్ట్ ఎండింగ్ లో ఉండదు. ఆ కారణంగా ఆమె కష్టం వృధా అయ్యింది. రోబో శంకర్ సింగిల్ లైన్ పంచులు కొన్ని చోట్ల బాగున్నప్పటికీ, చాలాసార్లు చిరాకు తెప్పిస్తాయి.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఎం.ఎస్.ఆనందన్ కథను ఆరంభించిన విధానం బాగుంది. అయితే.. సెకండాఫ్ కు వచ్చేసరికి కథనాన్ని గాలికి వదిలేశాడు. అందువల్ల దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ సెర్వర్ ను హ్యాక్ చేయగలిగిన సత్తా ఉన్న అమ్మాయి.. పదుల సంఖ్యలో చేసిన నేరాలన్నిటికీ కేవలం ఒకే ఐడీ యూజ్ చేయడం, ఫోటోతో సహా పోలీసుల దగ్గర దొంగ డీటెయిల్స్ ఉన్నప్పటికీ.. వాళ్ళు ఆమెను పట్టుకోకుండా కనీసం నిఘా పెట్టకుండా ఉండడం, అసలు ఆమెను క్లైమాక్స్ లో ఎలా పట్టుకొన్నారు అనేదానికి సరైన జస్టీఫికేషన్ ఇవ్వడకపోవడంతో యాక్షన్ థ్రిల్లర్ కాస్తా బోరింగ్ డ్రామా అయిపోయింది. యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతంతో, సుబ్రమణియం సినిమాటోగ్రఫీతో సినిమా స్థాయిని కాస్త పెంచడానికి, ఎమోషన్ ను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. కథ-కథనంలో దమ్ము లేకపోవడంతో వారి కష్టం పెద్దగా ఫలించలేదు.
విశ్లేషణ: రెగ్యులర్ కమర్షియల్ డ్రామాకు సైబర్ మేకప్ వేసిన చిత్రం “చక్ర”. అభిమన్యుడు స్థాయిలో ఉండదు కానీ.. మరీ బోర్ కూడా కొట్టదు. సో మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా టైంపాస్ కోసం ఒకసారి ఈ చిత్రాన్ని చూడొచ్చు. విశాల్ ఇకనుంచి ప్రొడక్షన్ డిజైన్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకొంటే ప్రేక్షకుడికి ఇంకాస్త బెటర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను కూడా ఇవ్వొచ్చు.