ఆస్కార్ వేదిక మీద తెలుగు పాట మెరుస్తుంది అని ఎవరన్నా అనుకున్నారా? మన దేశానికి చెందిన పాట వస్తే చాలు అనుకుంటున్న రోజులలో ఏకంగా మన పాట అక్కడికి వెళ్లి పురస్కారం సాధించింది. ఎవరూ కలలో కూడా ఊహించని ఈ అవార్డు వెనుక కారణాల్లో ఒకరు చంద్రబోస్. ఆయన రాసిన వాక్యాలే పాటగా మారి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో ‘నాటు నాటు..’ పాటగా మారాయి. దానికే పురస్కారం వచ్చింది. ఆ పాట వెనుకు ఉన్న స్ఫూర్తి గురించి ఆయన ఇటీవల మాట్లాడారు.
ఆస్కార్ అవార్డు సాధించిన అనంతరం చంద్రబోస్ తొలిసారి ఆదివారం తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు వచ్చారు. సొంతూరుకు వ్చిన చంద్రబోస్ తన ఇంటి పక్కనే ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భద్రకాళీ దేవాలయ ఆచార్యులు చంద్రబోస్, సుచిత్ర దంపతులను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఇంటి నుండి పాఠశాల వరకు వాహన ర్యాలీ నిర్వహించారు. అందులో ఉత్సాహంగా పాల్గొన్న ఈ దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో చంద్రబోస్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘నాటు నాటు..’ పాట రాయడానికి చల్లగరిగె గ్రామమే తనకు స్ఫూర్తి అని చెప్పారు. చిన్నతనంలో ఈ గ్రామంలో పరిశీలించిన అంశాలనే ఆ పాటలో పొందుపరిచానని ఆయన చెప్పారు. ఆత్మీయులు, గ్రామస్థుల ఆశీర్వాదంతో ఆస్కార్ సాధించానని చంద్రబోస్ చెప్పుకొచ్చారు. అంతేకాదు పుట్టిన ఊరుకి తనవంతుగా సేవ చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
చల్లగరిగెలో ఇంటి పక్కనే ఉన్న గ్రంధాలయంలోనే బాల సాహిత్యం చదువుకున్న చంద్రబోస్ (Chandrabose).. దాన్ని పునర్ నిర్మించే ఆలోచన చేస్తున్నారు. శిధిలావస్థలో ఉన్న ఆ గ్రంథాలయం స్థానంలో కొత్తదాన్ని నిర్మించి, దానికి ఆస్కార్ గ్రంథాలయం అనే పేరు పెట్టాలనేది తన ఆలోచన అని చంద్రబోస్ చెప్పారు. ఈ గ్రంధాలాయం పునర్ నిర్మాణానికి సంబధించిన పనులు త్వరలోనే ప్రారంభిస్తానని కూడా చెప్పారాయన.