ఇటీవలే రాని కరోనా వచ్చిందనుకొని అభిమానులను రెండ్రోజులపాటు భీభత్సమైన టెన్షన్ పెట్టిన చిరంజీవి.. “ఆచార్య” రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే.. తన తదుపరి చిత్రాలుగా కొన్ని సినిమాలను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అందులో మలయాళ చిత్రం “లూసిఫర్” రీమేక్ ప్రముఖమైనది. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనే విషయమే పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. తొలుత ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు అనుకున్నప్పటికీ.. సుజీత్ చేసిన మార్పులు చిరంజీవి & కో కు నచ్చకపోవడం వలన అతడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత వినాయక్ పేరు వినిపించింది. చిరంజీవితో “ఠాగూర్, ఖైదీ” వంటి చిత్రాలు తెరకెక్కించిన వినాయక్ అయితే పర్ఫెక్ట్ అనుకొన్నారందరు. కానీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పుడు “లూసిఫర్” తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించే అవకాశం తమిళ దర్శకుడు మోహన్ రాజాకు దక్కిందని తెలుస్తోంది. పలు తెలుగు చిత్రాలను తమిళంలో సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేసిన మోహన్ రాజా.. ముందు అనుకున్నట్లుగా ‘లూసిఫర్” స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదని,
హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఉండే అవకాశం కూడా లేదని సమాచారం. ఈమేరకు మొన్నటివరకు ఈ రీమేక్ విషయంలో తెగ టెన్షన్ పడిన మెగా అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే ఏడాదిలో సెట్స్ కి వెళ్లే ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించనున్నారు.