చిరంజీవి అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్లారు… అక్కడ ఇమడలేకపోయారు. చాలామందితో మాటలు పడాల్సి వచ్చింది. ఆఖరికి కొంతమంది అభిమానులు కూడా ‘మనకెందుకు చిరు’ అన్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే మాట అన్నారు. ‘రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా?’ అనిపిస్తోంది అని. అయితే ఆయన ఇంటెన్షన్ వేరు. ఆయన చెప్పింది తాప్సి గురించి మాట్లాడుతూ. ఇంతకీ చిరు ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏమని అన్నారో చూద్దాం. తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది.
దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ సినిమా ప్రధాన పాత్రధారుల్ని ఆకాశానికెత్తేసే పని మొదలుపెట్టారు. అలా తాప్సి గురించి మాట్లాడుతూ .. తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం’ ఈవెంట్‌కు హాజరయ్యానని, అప్పటికి, ఇప్పటికీ నటిగా ఆమెలో చాలా మార్పొచ్చింది అన్నారు. తాప్సి నటించిన నాయికా ప్రాధాన్య చిత్రాలు చూసినప్పుడు ‘క్యూట్‌గా ఉండే తాప్సీనేనా ఇంత పవర్‌ఫుల్‌గా నటించింది’ అని సందేహం కలుగుతుంటుంది అని చెప్పారు చిరు.
అయితే ఆయన అక్కడితే ఆగకుండా నేను రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తాప్సితో నటించే అవకాశం పొందలేకపోయాను. ఇలాంటి వారిని చూస్తున్నప్పుడు నేనెందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అనిపిస్తుంటుంది అని అన్నాడు చిరంజీవి. హిందీలో ఆమె బిజీ అవ్వడంతో తెలుగు సినిమాలు చేయలేకపోతోందని, కానీ తన సినిమాలో కచ్చితంగా నటించాలని చిరు అడిగారు. అయితే ‘బద్లా’ సినిమాలో తన నటనతో అమితాబ్ బచ్చన్‌ను డామినేట్ చేసినట్లు తనను డామినేట్ చేస్తే ఊరుకోనని సరదాగా చెప్పారు చిరు.
చిరంజీవి – తాప్సి కాంబినేషన్‌ను ఇప్పుడు ఊహించుకోవడం, అది నిజమవ్వడం అంత ఈజీ కాదు. తాప్సి ఇప్పుడు నాయికా ప్రాధాన్య సినిమాల మీదే దృష్టిపెట్టింది. నాలుగు పాటలు, ఆరు సీన్ల కమర్షియల్ సినిమాల మీద ఆలోచనే చేయడం లేదు. దీంతో చిరంజీవి అన్నమాట వర్క్‌వుట్ అవ్వడం కష్టం. ఒకవేళ అయితే మాత్రం ఇదో డిఫరెంట్ కాంబినేషన్ అవుతుంది. ఇక ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా గురించి చూస్తే.. ఈ సినిమా ఏప్రిల్ 1న థియేటర్లలోకి వస్తుంది.