మెగాస్టార్ చిరంజీవి కెరీర్ గురించి మాట్లాడాలంటే.. ‘ఖైదీ’ సినిమాకు ముందు, ‘ఖైదీ’కి తర్వాత అని అంటుంటారు. అంతలా ఆ సినిమాలో ఆయన కెరీర్‌పై ముద్ర వేసింది. ఆ సినిమాలో అంత స్పెషల్ ఏంటి? అనే డౌట్ మీకు వచ్చింది అంటే మీరు ఆ సినిమా చూడనివాళ్లే అయి ఉంటారు. ఓసారి ఆ సినిమా చూడండి మీకే అర్థమైపోతుంది. చిరు ఫ్యాన్ కాని వాళ్లకు కూడా ఆ సినిమా నచ్చేస్తుంది అని చెప్పొచ్చు. అలాంటి సినిమా ఆయన కాకుండా వేరే హీరో చేయాల్సింది తెలుసా?
అవును, మీరు చదివింది నిజమే… ‘ఖైదీ’ సినిమా (Khaidi Movie) తొలుత సూపర్ స్టాక్ కృష్ణ దగ్గరకు వెళ్లిందట. కృష్ణకు వ్యక్తిగత మేకప్ మ్యాన్‌గా చాలా కాలం పనిచేసిన మాధవ రావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కృష్ణ తనకు వచ్చిన అవకాశాల్లో కొన్ని సినిమాలకు వేరే నటీనటులను తీసుకోవాలని సలహా ఇచ్చేవారట. అలా ఆయన వదులుకున్న సినిమాల గురించి మాధవరావు చెబుతూ ‘ఖైదీ’ సినిమా గురించి మాట్లాడారు. ‘ఖైదీ’ సినిమా స్క్రిప్ట్ తొలుత కృష్ణ దగ్గరకు వచ్చిందని, అయితే నిర్మాతలకు చిరంజీవిని ఆ కథకు తీసుకోవాలని కృష్ణ సూచించారట.
చిరంజీవి డ్యాన్స్ బాగా చేస్తాడని, అతడినే ఆ కథకు తీసుకోవాలని కృష్ణ చెప్పారట. దాంతో నిర్మాతలు ఆ సినిమా కోసం చిరంజీవిని సంప్రదించడం, ఆయన ఓకే చేయడం జరిగిపోయాయట. ఆ తర్వాత సినిమా ఎలాంటి విజయం సాధించింది, చిరు కెరీర్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయో మనందరికీ తెలిసిందే. ఆ సినిమానే కాదు కృష్ణంరాజు ‘కటకటాల రుద్రయ్య’ సినిమా కూడా తొలుత ఆ దర్శకనిర్మాతలు కృష్ణని సంప్రదించారట. కృష్ణంరాజుకు ఆ స్క్రిప్ట్ బాగుంటుందని కృష్ణే సూచించారట.
‘కటకటాల రుద్రయ్య’ సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి మరీ కృష్ణంరాజు నటనను కృష్ణ ప్రశంసించారట. ఈ తరహాలో తన దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్‌లకు ఏ హీరో సరిపోతారో చూసి వారి దగ్గరకు దర్శకనిర్మాతలను కృష్ణ పంపించేవారు అని మాధవరావు తెలిపారు.