మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈరోజే సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇది కాకుండా.. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాల్లో నటిస్తున్నారు.
అలానే యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో మరో ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు వీటితో పాటు మలయాళ సినిమా ‘బ్రో డాడీ’ను రీమేక్ చేయాలనుకుంటున్నారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ.. భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ స్వయంగా డైరెక్ట్ చేశారు. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి.. మోహన్ లాల్ పాత్ర పోషించనున్నారు. అతడి కొడుకుగా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ కోసం మరో మెగాహీరోని తీసుకోవాలనుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ లేదా వరుణ్ తేజ్ లలో ఒకరు చిరంజీవి కొడుకుగా నటించబోతున్నారు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ పై దర్శకుడు హరీష్ శంకర్ పని చేస్తున్నారు. కానీ ఆయన డైరెక్టర్ గా పని చేస్తారా..? లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.
ఆయన గనుక స్క్రిప్ట్ ని పూర్తి చేసేస్తే దర్శకుడి విషయంలో చిరంజీవి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చిరంజీవి సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను నిర్మించనున్నారు. మరి తెలుగులో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారో లేక నేరుగా థియేటర్లలో విడుదల చేస్తారో చూడాలి!