చిరంజీవి చేతికి ఏమైంది… ఆదివారం మధ్యాహ్నం నుండి సోషల్ మీడియాలో ఇదే చర్చ. కారణం చిరంజీవి చేతికి కట్టు ఉన్న ఫొటో ఒకటి బయటక రావడం. తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి…. చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ ఉండడం అభిమానులను కలవరపెట్టింది. చిరంజీవి షూటింగ్‌లో ఏమన్నా గాయపడ్డారా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే తన కట్టు గురించి చిరంజీవి ఆ కార్యక్రమంలోనే స్పందించారు. ఆ విషయం కాస్త ఆలస్యం బయటకు వచ్చింది.
అరచేతికి చిన్నపాటి సర్జరీ అయిందని చిరంజీవి తన అభిమానులతో చెప్పారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా నొప్పిగా, తిమ్మిరి పట్టినట్లుగా ఉండటంతో డాక్టర్ ను సంప్రదించానని చిరు చెప్పారు. కుడి చేతి మణికట్టు దగ్గరున్న మీడియన్ నర్వ్ అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని చిరంజీవికి డాక్టర్లు వెల్లడించారట. దీంతో అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందట.
మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, చేతిపై ఒత్తిడి తగ్గించారని చిరంజీవి చెప్పుకొచ్చారు. మరో 10-15 రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యథావిధిగా పని చేస్తుందని చిరంజీవి చెప్పారు. దర్శకుడు విజయబాపినీడు అల్లుడైన సుధాకర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సర్జరీ చేశారని చిరంజీవి చెప్పారు. ఈ సర్జరీ కారణంగా ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ కాస్త గ్యాప్ ఇచ్చామని చిరు చెప్పారు. ఇప్పటికే సినిమా ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేశామని, తిరిగి నవంబరు 1 నుండి చిత్రీకరణ ఉంటుందని చిరంజీవి తెలిపారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని… అభిమానులు, శ్రేయోభిలాషులు కంగారు పడాల్సిన అవసరం లేదని చిరంజీవి చెప్పారు.