అల్లు అర్జున్ (Allu Arjun) , – సంధ్యా థియేటర్ – రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు, ఎవరికి ఒప్పు.. ఎవరు చెప్పింది నిజం, ఎవరు చెబుతున్నది అబద్ధం అనేది పోలీసులు, కోర్టులు తేలుస్తాయి. ఇక్కడ సమస్య ఏంటంటే.. విషయం మరింత జఠిలం కాకుండా చూసుకోవడం. అంటే ఇటు నుండి ఒక కామెంట్, అటు నుండి మరో కామెంట్ అనేలా గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం నడుస్తోంది. దీనికి కొన్ని రాజకీయ పార్టీలు మధ్యలో నెయ్యి పోస్తున్నాయనే కామెంటూ ఉంది.
Chiranjeevi
అయితే, ఇప్పుడు కావాల్సింది విషయాన్ని లాగేవాళ్లు కాదు.. ఇక్కడితో తేల్చేవాళ్లు. అలాంటి వ్యక్తి, రెండు వర్గాలకు సన్నిహితమైన వ్యక్తి ఎవరా అని అనుకుంటున్నారా? ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) . అల్లు అర్జున్ ఇటీవల అరెస్టు అవ్వగానే కోర్టులు, వాదనలు ఇతర వ్యవహారాలను వెనకుండి నడిపించింది చిరంజీవి అని అంటారు. అయితే ఆయన ఈ వ్యవహారంలో ఎక్కడా ముందు కనిపించలేదు. దీంతో ఈ విషయంలో క్లారిటీ లేదు.
అప్పుడేమైందో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం చిరంజీవి ముందుకొచ్చి విషయం చేజారకుండా ఆపాల్సిందే అని అభిమానులు కోరుకుంటున్నారు. చినుకు చినుకు గాలివానగా మారుతున్న సంధ్య థియేటర్ వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరగడం, దానికి ప్రతిగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యామయి. ఈ క్రమంలో మంత్రులు, పోలీసు అధికారులు రంగంలోకి దిగిపోయారు. ఇదంతా చూస్తుంటే విషయం చాలా చాలా పెద్దది అయ్యేలా ఉంది.
దీంతో సంధి కుదర్చాల్సిన అవసరం ఏర్పడింది. రెండు వైపులా మాట్లాడగలిగే వ్యక్తి, ఆ చొరవ, పరిచయం ఉన్న వ్యక్తి చిరంజీవి. ఇటు బన్నీకి మేనమామ.. అటు కాంగ్రెస్‌లో సభ్యుడు కావడం ఆయన ఈ పని చేయగలరు అని అంటున్నారు. దీనికి టాలీవుడ్ సీనియర్ పెద్దల సాయం కూడా తీసుకోవాలి. మరి చిరంజీవి ఎప్పుడు, ఎలా ముందుకొస్తారో చూడాలి. టాలీవుడ్ జనాలు కూడా ఈ విషయంలో కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.