తొందరపడి ఓ కోయిల ముందే కూస్తే… ఆ తర్వాత ఇంకొన్ని దానికి వంతపాడాయి. ఇది దేని గురించో మీకు అర్థమైపోయుంటుంది. అదేనండీ.. ‘మా’ ఎన్నికల కోసం. అయితే ఇప్పుడు ఆ కోయిలలు లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం తేలిపోయింది. ‘మా’ ఎన్నికల తేదీని ప్రాథమికంగా నిర్ణయించారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబరు రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారట. ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు నేతృత్వంలో ఇటీవల ‘మా‘ కార్యవర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆగస్టు 22న ‘మా’ జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
దాంతోపాటు ఎన్నికల విషయంలో తీవ్రంగా చర్చించిన కమిటీ… సెప్టెంబర్ 12న ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియకుండానే ఎన్నికలకు సిద్ధమంటూ ఇటీవల నటులు ముందుకొచ్చారు. దీంతో ‘మా’లో వేడి రాజుకుంది. కార్యవర్గ పదవీకాలం ముగియడంతో కొంతమంది కార్యవర్గ సభ్యులు ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు. ఇప్పుడున్న కార్యవర్గం పదవీ కాలం ముగిసిందని, ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖలో కోరారు. దీంతో సమావేశమైన ఆయన ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకున్నారు.
‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు లేకుండా ‘మా’ అధ్యక్ష పదవిని ఏకగ్రీవం చేయాలని సీనియర్ సభ్యులు చూస్తున్నారు. ఆగస్టు 22న జరగనున్న జనరల్ బాడీ సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.