‘జైలర్’ తో రజినీకాంత్ మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. ఆ తర్వాత రజినీకాంత్ నుండి వచ్చిన ‘వేట్టయన్’ బాగానే ఆడింది. దీంతో ఇప్పుడు రజినీకాంత్ నుండి రాబోతున్న ‘కూలీ’ పై భారీ అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ రాజమౌళిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్స్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి ఉన్న మరో ప్రత్యేకత గురించి కూడా అందరికీ తెలిసిందే.
‘కింగ్’ నాగార్జున ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అది కూడా ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ కావడం విశేషం. చెప్పాలంటే ‘కూలీ’ అనగానే ఎక్కువగా నాగార్జున గురించే మాట్లాడుకుంటున్నారు. 40 ఏళ్ళ సినీ కెరీర్లో తొలిసారి విలన్ రోల్ చేస్తున్నారు నాగార్జున. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలాగే ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కూడా అతిథి పాత్రలు పోషించారు. ఆగస్టు 14న ‘కూలీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఇండస్ట్రీ జనాల్లో కొంతమంది ఈ సినిమాను వీక్షించడం జరిగింది.
వారి టాక్ ప్రకారం.. ‘కూలీ’ 2 గంటల 49 నిమిషాల నిడివి కలిగి ఉందట. సైమన్(నాగార్జున) పాత్రతోనే సినిమా స్టార్ట్ అవుతుందట. ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చూడనంత స్టైలిష్ గా నాగార్జున కనిపిస్తారట.అతని డైలాగ్ డెలివరీ, వాకింగ్ స్టైల్, కారు దిగే స్టైల్ అన్నీ కూడా వావ్ అనేలా ఉంటాయట. మరోపక్క సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ కొంచెం లేట్ గా ఉంటుందట. అయితే యాక్షన్ సీక్వెన్స్ లో రజినీకాంత్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారని అంటున్నారు.
కొన్నాళ్లుగా రజినీ కాంత్ చేస్తున్న సినిమాల్లో నిలబడిన చోటు నుండే ఫైట్స్ చేస్తూ కనిపించారు. అయితే ఇందులో ఆయన ఫైట్స్ లో కూడా గ్రేస్ చూపించారని… వాటికి అనిరుధ్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని.. అంతా చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్ గా అయిపోతుందట. క్లైమాక్స్ కూడా వర్కౌట్ అయ్యే విధంగా ఉంది అంటున్నారు. రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.