టాలీవుడ్ లో ఎంత పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా.. నైజాం ఏరియా హక్కులు దక్కించుకోవడానికి దిల్ రాజు ముందున్నారు. ఓవైపు ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నా.. పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ.. డిస్ట్రిబ్యూషన్ ని మాత్రం వదలకుండా ఆ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు దిల్ రాజు. నైజాంలో థియేటర్ల మీద, అలానే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మీద దిల్ రాజుకి తిరుగులేదు. పెద్ద సినిమాలకు ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చి తన సంస్థ ద్వారా రిలీజ్ చేస్తుంటారాయన.
టాలీవుడ్ లో కొన్ని పెద్ద బ్యానర్లు సొంతంగా నైజాంలో తమ సినిమాలను రిలీజ్ చేసుకున్నా.. దిల్ రాజు సపోర్ట్ లేకుండా ఏదీ జరగదని టాక్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మొదటి నుంచి తమ సినిమా హక్కులను దిల్ రాజుకే ఇస్తున్నారు. ఇప్పుడు మైత్రి సంస్థ సొంతంగా నైజాంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థను ఏర్పాటు చేసుకొని సంక్రాంతికి తమ సంస్థ నుంచి వస్తోన్న ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలను ఓన్ గా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో దిల్ రాజు కాస్త సీరియస్ గా ఉన్నట్లు టాక్.
తాజాగా ఈ విషయంపై దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైత్రి వాళ్లు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టడం మంచి విషయమే అని చెబుతూ.. ఈ విషయంలో తాను హర్ట్ అయినట్లు పరోక్షంగా చెప్పారు. మైత్రి సంస్థ తొలి సినిమాను మినహాయిస్తే ప్రతి సినిమాను తానే నైజాంలో రిలీజ్ చేశానని.. వాళ్లకు ఫ్యాన్సీ రేట్లు ఇచ్చానని అన్నారు. ‘ఉప్పెన’ సినిమా విషయంలో చిన్న ఇబ్బంది వచ్చినా.. ఆ తరువాత కూడా తమకే సినిమా హక్కులను ఇచ్చారని దిల్ రాజు చెప్పారు.
నిజంగానే తనతో ఇబ్బంది ఉంటే ‘ఉప్పెన’ తరువాత తనకు సినిమా ఇచ్చేవారు కాదు కదా..? అని ప్రశ్నించారు. మైత్రి వాళ్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్న రెండు సినిమాలతో అంతా అయిపోదని.. రెండేళ్ల తరువాత బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే తమ నిర్ణయం కరెక్టా..? కాదా..? అనేది అర్ధమవుతుందని.. అప్పుడు దిల్ రాజు, శిరీష్ ల వర్త్ ఏంటో తెలుస్తుందని అన్నారు. ఈ మాటలను బట్టి మైత్రి వాళ్లు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరవడం దిల్ రాజుని బాధ పెట్టిందనే అనిపిస్తుంది.