దిల్ రాజు (Dil Raju) తన సోదరులు శిరీష్- లక్ష్మణ్..లతో కలిసి సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ లో రూపొందే సినిమాల శిరీష్- లక్ష్మణ్..లది కూడా కీలక పాత్ర. ప్రమోషన్స్ లో శిరీష్, లక్ష్మణ్ ఎక్కువ మాట్లాడరు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్లలో శిరీష్ కొంచెం ఎమోషనల్ గా మైక్ ముందు నోరు విప్పారు..అంతే..! ఇప్పుడు ‘తమ్ముడు’ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
ఇందులో భాగంగా శిరీష్.. ‘ ‘గేమ్ ఛేంజర్’ తర్వాత హీరో చరణ్ కానీ, దర్శకుడు శంకర్ కానీ మాకు కనీసం ఫోన్ చేసి మాట్లాడింది లేదు’ అంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. ఆయన కామెంట్స్ కి సంబంధించిన వీడియో క్లిప్ ను కొంతమంది యాంటీ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి మెగా అభిమానులను రెచ్చగొట్టారు. దీంతో మెగా అభిమానులు దిల్ రాజు- శిరీష్..లకు వార్నింగ్ ఇస్తూ ఓ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ‘ ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత మా హీరో మీకు డేట్స్ ఇస్తే ఇలాంటి డిజాస్టర్ తీయడమే కాకుండా మా హీరో(చరణ్) పై విషం చిమ్ముతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో దిల్ రాజు శిరీష్ కామెంట్స్ కి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన మాట్లాడుతూ.. “శిరీష్ ఎక్కువగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ షూటింగ్లో ఉండేవాడు. కానీ ‘గేమ్ ఛేంజర్’ డిస్ట్రిబ్యూషన్, దానికి వచ్చిన కలెక్షన్స్ అన్నీ అతను చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. అతన్ని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కూడా మానిప్యులేట్ చేశాడు. అతను ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఎలా ఉంటుందో ప్రపంచం అంతా తెలుసు. ఆ బాధలో నుండి ఒక ఇంటర్వ్యూలో ఫిల్టర్ లేకుండా మాట్లాడాడు.
గేమ్ ఛేంజర్ షూటింగ్లో ఎక్కువగా నేనే ఉండేవాడిని, శిరీష్ డిస్ట్రిబ్యూటర్ గా మాట్లాడాడు. ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తే శిరీష్ ఏమన్నాడో పూర్తిగా అర్థమవుతుంది. చిన్న బిట్ షేర్ చేసి అంత హడావిడి చేయడం కరెక్ట్ కాదు. చరణ్ తో శిరీష్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ‘గేమ్ ఛేంజర్’ వచ్చి 6 నెలలు అయినా ఇంకా ఆ సినిమా గురించే మమ్మల్ని గుచ్చి గుచ్చి చంపుతున్నారు. ఇండస్ట్రీలో అంతకంటే ప్లాప్ సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ ‘గేమ్ ఛేంజర్’ నే పట్టుకున్నారు” అంటూ క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు.