తెలుగు సినిమా నిర్మాతగా లాంగెస్ట్ కెరీర్ ఉన్న వ్యక్తి దిల్ రాజు (Dil Raju). ఎన్నో విజయాలు, ఎన్నో ఆటుపోట్లు, ఇంకెన్నో ఇబ్బందులు.. అన్నిటినీ ఎదుర్కొని దృఢంగా నిలబడిన వ్యక్తి దిల్ రాజు. అటువంటి దిల్ రాజు (Dil Raju)ను “గేమ్ ఛేంజర్” చాలా ఇబ్బందిపెట్టింది. ఏ స్థాయిలో అంటే.. “తమ్ముడు” (Thammudu) ప్రమోషన్స్ లో దయచేసి “గేమ్ ఛేంజర్” గురించి మాత్రం అడగకండి అని మీడియాని వేడుకొనేంత. అయినప్పటికీ.. ఏదో ఒక విధంగా గేమ్ ఛేంజర్ (Game Changer) గురించి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి, ఆయన దానికి ఓపిగ్గా సమాధానాలు చెబుతూనే వచ్చారు. మరో రెండు రోజుల్లో విడుదలకానున్న “తమ్ముడు” ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు ప్రింట్ & వెబ్ మీడియాతో ముచ్చటించారు దిల్ రాజు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..!!
గేమ్ ఛేంజర్ నష్టాలు కూడా వాళ్లనే ఇవ్వమనండి..
రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” సినిమా ప్రొడ్యూస్ చేసింది “జీ స్టూడియోస్” అని ఆ సంస్థ చెప్పుకొంటున్న విషయమై ప్రశ్నించగా.. దిల్ రాజు ఇమ్మీడియట్ గా “అయితే ఆ లాస్ లను కూడా వాళ్లనే భరించమనండి” అని సమాధానం ఇచ్చారు.
ఓటీటీ సంస్థలతో ఇబ్బంది లేదు..
ఇప్పుడు థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసేప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోగోలను ప్రదర్శించడం ఆపేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. దానివల్ల థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ను తగ్గిపోతున్నారు. అయితే.. ఇప్పటికే నిర్మాతలు ఆ లోగో ఎందుకు తీయట్లేదో అర్థం కావడం లేదు. కనీసం ఇప్పటినుంచైనా ఫాలో అయితే బెటర్. ఓటీటీ సంస్థలకు కూడా ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
నితిన్ ని తక్కువ చేసి మాట్లాడలేదు..
మొన్నామధ్య ఇంటర్వ్యూలో నితిన్ ని ఏదో తిట్టేశానని చాలా మంది నా మీద మండిపడ్డారు. నిజానికి నితిన్ నాకంటే, అల్లు అర్జున్ కంటే సీనియర్. ఆ ఇంటర్వ్యూలో నితిన్ తన కెరీర్ గురించి అడిగాడు కాబట్టే అలా చెప్పాను తప్పితే.. నితిన్ ని ఏదో తక్కువ చేయాలని కాదు.
శిరీష్ ఏదో ఫ్లోలో అన్నాడు అంతే..
శిరీష్ మొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏదో ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఫ్లోలో వచ్చిన పూర్తి విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. సింపుల్ గా చిన్న చిన్న క్లిప్స్ కట్ చేసి పోస్ట్ చేశారు. అందువల్ల నష్టం జరిగిందే తప్ప.. ఎవరికీ ఉపయోగపడలేదు.
ఎంత ఖర్చుపెట్టినా.. ఆ ఒక్క షోతో తెలిసిపోతుంది
ఒక నిర్మాతగా ప్రొడక్షన్ & పబ్లిసిటీకి మా దమ్మున్నంత వరకు ఖర్చు పెడతాం. ప్రోడక్ట్ రెడీ చేసి రిలీజ్ చేస్తాం. కానీ.. ఆ మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది. అందువల్ల ఏ విషయంలోనూ సరిగా క్లారిటీ ఉండడం లేదు.
ఇకపై బూస్టింగులు చేయను..
సినిమా ట్రైలర్ కి డబ్బులు పెట్టి మరీ వ్యూస్ తెచ్చుకోవడం అనేది ఎవరికీ ఉపయోగం ఉండదు. ఫిలిం మేకర్స్ కానీ, డైరెక్టర్ కానీ ఈ మిధ్య నుంచి బయటపడాలి. దాని వల్ల సినిమాకి రూపాయి ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేను ఓపెన్ అవ్వడం వల్ల జనాలు కూడా ఇది ఆర్గానిక్, ఇది బూస్టింగ్ అని గుర్తించడం మొదలుపెట్టారు.
150 వర్కింగ్ డేస్ వల్లే తమ్ముడు బడ్జెట్ పెరిగింది..
తమ్ముడు బడ్జెట్ పెరగడానికి ముఖ్య కారణం వర్కింగ్ డేస్ ఎక్కువవ్వడమే. అందుకే డైరెక్టర్ వేణు శ్రీరామ్, హీరో నితిన్ తమ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. సినిమాటోగ్రాఫర్ మారాల్సి వచ్చినా ఇబ్బందేమీ అవ్వలేదు. గుహన్ మంచి కేర్ తీసుకున్నారు.
తెలంగాణలో త్వరలోనే ఒరిజినల్ కలెక్షన్స్..
కుదిరినంత త్వరగా తెలంగాణాలో రెంట్రాక్ పద్ధతిని పరిచయం చేసే పనిలో ఉన్నాం. దాంతో ఇక నుంచి ఒరిజినల్ కలెక్షన్స్ మాత్రమే బయటికి వస్తాయి. అలాగే.. ప్రభుత్వంతో కలిసి “బుక్ మై షో” యాప్ లాంటిది రూపొందించేందుకు రంగం సిద్ధమవుతోంది.
భవిష్యత్ ప్రాజెక్ట్స్..
విజయ్ దేవరకొండతో “రౌడీ జనార్ధన”, నితిన్ తో “ఎల్లమ్మ”, ఆశిష్ తో “దేత్తడి”, మార్కో డైరెక్టర్ తో ఒక సినిమా, జంతువు ప్రధానంగా ఒక యాక్షన్ సినిమా.. అందుకోసం ఒక స్టార్ హీరో కావాలి, “జటాయు” అనే 8 ఎపిసోడ్ల సిరీస్. మరియు దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో కొత్త టీమ్ తో రెండుమూడు సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి. అలాగే కొత్త డైరెక్టర్స్ తో రెండు సినిమాలు డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి.
అల్లు అర్జున్ తో మరో సినిమా..
ప్రశాంత్ నీల్ తో “రవణం” అనే సినిమా ప్లాన్ చేస్తున్నాం. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఆ సినిమా చేయాలి అనేది ప్లాన్. అయితే వాళ్లిద్దరూ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. వాటి తర్వాత ఆ సినిమా కచ్చితంగా ఉంటుంది.
త్వరలోనే హైదరాబాద్ లో చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్..
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి గద్దర్ అవార్డ్స్ నిర్వహించాం. త్వరలోనే హైదరాబాద్ కి చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ను తీసుకొస్తాం.