టాలీవుడ్‌లో మరో ఎన్నికల వేడి ముగిసింది. నిజ రాజకీయాలను తలపిస్తూ సాగిన ప్రచారం, ప్రెస్‌మీట్లు, కామెంట్లు వచ్చిన విషయం తెలిసిందే. అలా జరిగిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు గెలుపొందారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన TFCC ఎన్నికల్లో ప్రత్యర్థి నిర్మాత సి.కల్యాణ్‌పై 17 ఓట్ల ఆధిక్యంతో దిల్ రాజు విజయం సాధించారు. ఎగ్జిబిటర్ సెక్టార్ సభ్యులంతా దిల్ రాజుకు మద్దతుగా నిలిచారు.
మొత్తం 2,262 మంది సభ్యులకు గానూ 1,339 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్టూడియో సెక్టార్, ప్రొడ్యూసర్ సెక్టారుల్లో దిల్ రాజు ఆధిక్యం సాధించారు. అయితే డిస్ట్రిబ్యూటర్ సెక్టార్‌లో సి.కల్యాణ్, దిల్ రాజుకు మద్దతు సమానంగా లభించింది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల ఓట్లు కీలకంగా మారాయి. ఈ క్రమంలో నిర్వహించిన రహస్య ఓటింగ్ ద్వారా దిల్ రాజు పైచేయి సాధించారు. ప్రొడ్యూసర్ సెక్టార్‌లో 891 ఓట్లలో దిల్ రాజుకు 563 ఓట్లు పోలవ్వగా, ప్రత్యర్థి సి.కల్యాణ్‌కు 497 ఓట్లు వచ్చాయి.
TFCC కొత్త ఉపాధ్యక్షులుగా ముత్యాల రాందాసు, కాకినాడ శ్రీనివాస్, కొల్లి రామకృష్ణగా గెలుపొందారు. ఇక కార్యదర్శిగా దామోదర ప్రసాద్, కోశాధికారిగా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం 2023- 2025 వరకు పదవిలో ఉంటుంది. దిల్ రాజు ప్యానెల్‌లో ప్రొడ్యూసర్ సెక్టార్‌లో పోటీ చేసిన 12 మందిలో ఏడుగురు విజయం సాధించారు. సి.కళ్యాణ్ ప్యానెల్ నుంచి ఐదుగురు గెలుపొందారు. దిల్ రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, పద్మిని, స్రవంతి రవికిశోర్, రవిశంకర్ యలమంచిలి, మోహన్ గౌడ్ విజేతలుగా నిలిచారు.
ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధించాలంటే అన్ని సెక్టార్లు కలిపి ఒక ప్యానల్‌కు 25 ఓట్లు ఉండాలి. తుది ఫలితాల్లో దిల్ రాజు ప్యానెల్‌లో మొత్తం 24 మంది, సి.కళ్యాణ్ ప్యానెల్‌కు 20 మంది అభ్యర్థులు గెలుపొందారు. దిల్ రాజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు 25 ఓట్లు అవసరం. దీంతో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించి, నిర్ణయాన్ని వెల్లడించారు. చివరికి 31 మంది మద్దతుతో దిల్ రాజునే విజేతగా నిలిచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.