టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ఆర్ఆర్ఆర్ సినిమా నైజాం హక్కులను ఏకంగా 70 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశారు. రాజమౌళి గత సినిమాలు భారీమొత్తంలో లాభాలను అందించడంతో దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాజమౌళి గత సినిమాలు పెద్దగా పోటీ లేకుండా రిలీజైన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటన తర్వాత సంక్రాంతి రేసు నుంచి సర్కారు వారి పాట తప్పుకోగా భీమ్లా నాయక్ మాత్రం సంక్రాంతి రేసులో ఉన్నట్టు ప్రకటన వెలువడింది.
భీమ్లా నాయక్ మేకర్స్ చేసిన ప్రకటన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు సినిమాను రిలీజ్ చేయకపోతే సమ్మర్ వరకు సినిమాను రిలీజ్ చేయడం కుదరదని అందువల్ల సినిమా రిలీజ్ ను ఆపలేమని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు పట్టుదలగా ఉన్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ కు, భీమ్లా నాయక్ కు మధ్య గ్యాప్ ఐదురోజులు ఉండటంతో రికవరీ కష్టమవుతుందని భావించి దిల్ రాజు రంగంలోకి దిగారని తెలుస్తోంది. పవన్ గత సినిమా వకీల్ సాబ్ కు దిల్ రాజు నిర్మాత అనే విషయం తెలిసిందే.
భీమ్లా నాయక్ ను వాయిదా వేయించాలని ఆ తర్వాత భీమ్లా నాయక్ ఎప్పుడు విడుదలైనా తమ సహకారం ఉంటుందని దిల్ రాజు భీమ్లా మేకర్స్ కు, పవన్ కు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దిల్ రాజు ప్రతిపాదనకు పవన్ అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది. పవన్ తలుచుకుంటే తప్ప భీమ్లా నాయక్ వాయిదా ఉండకపోవచ్చని సమాచారం అందుతోంది.