గతేడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహరెడ్డి’ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రానికి చాలా మంది దర్శకులు సాయం చేసారని చాలా వార్తలు వచ్చాయి. సినిమా మొత్తం రెడీ అయిన తరువాత మెగాస్టార్ తన సన్నిహితులైన దర్శకులకు రషెస్ చూపించి వారి విలువైన సలహాలు తీసుకున్నారట. ఇది కొత్తేమీ కాదు… అప్పట్లో చక్రపాణి వంటి పెద్దలకు కూడా రషెస్ చూపించి మార్పులు చేర్పులు చేయించుకునేవారట. ఇప్పుడు ‘ప్రభాస్ 21’ కు కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం పూర్తిగా వేరు.
ఇంకా ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలుకాలేదు. ప్రీ ప్రొడక్షన్ స్టేజి నుండీ కొంతమంది దర్శకులను మెంటర్లుగా పెడుతున్నారు ఈ చిత్ర నిర్మాత అశ్వినీ దత్. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇలాంటి సినిమాలకు సింగీతం శ్రీనివాసరావు గారు కేరాఫ్ అడ్రెస్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన్ని ఈ ప్రాజెక్టుకి స్క్రిప్టు పర్యవేక్షకుడిగా తీసుకున్నారు. ఇక కె. రాఘవేంద్ర రావు గారు కూడా ఈ చిత్రానికి మరో మెంటర్ గా పనిచెయ్యబోతున్నట్టు తాజా సమాచారం.
ఫాంటసీ చిత్రాలు చెయ్యడంలో ఆయన కూడా దిట్ట అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన దర్శకత్వ పర్యవేక్షణ ఈ చిత్రానికి చాలా అవసరం అని నిర్మాత అశ్వినీ దత్ భావిస్తున్నారట. అందులోనూ అశ్వినీదత్ గారితో రాఘవేంద్ర రావుగారికి మంచి అనుబంధం కూడా ఉంది. పైగా దత్ గారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పేమీ లేదనే చెప్పాలి.