వాహనాలకు ఉన్న బ్లాక్ స్టికర్లు, బ్లాక్ ఫిల్మ్ లను తొలగించాలని గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. అలా తొలగించని వారి వాహనాలకు ఫైన్స్ కూడా వేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను పోలీసులు తొలగించి జరిమానా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ దర్శకుడు త్రివిక్రమ్ కారుని కూడా తనిఖీలు చేశారు పోలీసులు.
అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో దాన్ని తొలగించి జరిమానా విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. తనిఖీలు జరిగిన సమయంలో త్రివిక్రమ్ కారులోనే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సెలబ్రిటీలు ప్రైవసీ కోసం బ్లాక్ ఫిల్మ్ లు వాడుతుంటారు. అయితే బ్లాక్ ఫిల్మ్ లు వాడడం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువ. నేరస్థులు తప్పించుకోవడానికి బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలు వాడుతున్నట్లు తేలింది.
అంతేకాదు మహిళలపై లైంగిక దాడులు, దొంగతనాలు, కిడ్నాప్ లకు పాల్పడేవారు కూడా ఈ బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను ఉపయోగించి తప్పించుకుంటున్నట్లు విచారణలో తేలింది. దీంతో న్యాయస్థానాలు వీటి వాడకంపై నిషేధం విధించాయి. కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు ఫైన్ వరకు తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను గౌరవించి సెలబ్రిటీలు స్వతహాగా బ్లాక్ ఫిల్మ్ ను తొలగిస్తే రియల్ లైఫ్ లో కూడా ప్రజలకు ఆదర్శంగా నిలిచినవారవుతారు.
ఇక త్రివిక్రమ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన ‘భీమ్లానాయక్’ సినిమాకి మాటలు-స్క్రీన్ ప్లే అందించిన ఆయన.. త్వరలోనే మహేష్ బాబు సినిమాను మొదలుపెట్టనున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు చేయనున్నారు.