అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం 2018 మే 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలా అని దర్శకుడిగా వక్కంతం వంశీ విఫలమయ్యాడని చెప్పడం కూడా కరెక్ట్ కాదు.రిజల్ట్ పరంగా.. ఆ సినిమా మిస్ ఫైర్ అయ్యింది. అయితే ఆ తరువాత వక్కంతం వంశీకి దర్శకుడిగా అవకాశాలు దక్కలేదు.
కొన్నాళ్ల పాటు తన దగ్గర ఉన్న కథలతో హీరోలను సంప్రదించాడు కానీ వర్కౌట్ కాలేదు. ఓ దశలో రవితేజతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు కూడా మొదలుకాలేదు. అయితే ఇప్పుడు ఈ ప్లాప్ డైరెక్టర్ కు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చాడని టాక్ నడుస్తుంది. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ కు వంశీ ఓ కథ వినిపించాడట. ఆ కథ పవన్ కు నచ్చింది. కానీ పవన్ అంతకంటే ముందు వేరే చిత్రం చేద్దాం అని వంశీకి చెప్పాడట.
అది ఓ రీమేక్ అని తెలుస్తుంది. పవన్ కు అత్యంత సన్నిహతుడు అయిన ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ అధినేత రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. ఇదే బ్యానర్లో సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చెయ్యడానికి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ చిత్రానికి కూడా పవన్ వక్కంతం వంశీ రచయితగా పనిచేస్తున్నట్టు సమాచారం.