ఓ సినిమా ఫలితం అందులో నటించినవాళ్లు, ఆ సినిమాకు పని చేసిన వాళ్ల మీదే ప్రభావం చూపిస్తుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సినిమా ఫలితం ఇండస్ట్రీలో ఇతరుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ‘లైగర్’ ఫలితం కూడా ఇలానే మిగిలిన నటులు, దర్శకుల మీద కూడా కాస్త ప్రభావం చూపిస్తోంది అని చెప్పొచ్చు. వైవిధ్యాన్ని నమ్ముకున్న దర్శకుల మీద ఈ ప్రభావ ఉండకపోయినా, మూస మాస్ మేనరిజమ్, కథ — కథనాలను నమ్ముకున్న వారికి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ‘లైగర్’.
ఎన్నో అంచనాలతో, దేశాన్ని షేక్ చేస్తామనే ప్రకటనలో ఆగస్టు 25న వచ్చి విలవిల్లాడిపోతున్న ‘లైగర్’ ఫలితం.. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మాస్ దర్శకులను ఇబ్బంది పెడుతోంది. ‘లైగర్’ సినిమా పక్కా మాస్ కాకపోయినా.. ఆ ఛాయలే ఎక్కువ ఉంటాయి. విజయ్ దేవరకొండ పడ్డ కష్టం మీద ఎవరికీ ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కానీ విజయ్ లాంటి హైవోల్టేజీ నటుణ్ని సరిగ్గా వాడుకోలేకపోయారు అంటూ అందరూ పూరినే అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి పొటన్సియాలిటీ ఉన్న హీరోలను హిట్లు లేని దర్శకులు కొంతమంది హ్యాండిల్ చేస్తున్నారు.
దీంతో వారి పరిస్థితి ఏంటి అనే భయం మొదలైంది అంటున్నారు. చిరంజీవితో మొదలుపెడితే.. ‘ఆచార్య’ ఎలాంటి దెబ్బేసిందో చూశాం. ఇప్పుడు మోహన్‌రాజాతో ‘గాడ్‌ఫాదర్’, బాబితో ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు), మెహర్ రమేశ్‌తో ‘భోళా శంకర్’ చేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఆఖరి ఇద్దరు దర్శకులకు సరైన విజయం లేదు. మరోవైపు ప్రభాస్ సినిమా దగ్గరికొచ్చేసరికీ ఇలాగే ఉంది. ఏకంగా మారుతితో సినిమా వద్దని మొన్నీ మధ్య ప్రభాస్‌ను ఉద్దేశిస్తూ ట్విటర్ పెద్ద ట్రెండింగ్ ఉద్యమమే నిర్వహించారు.
ప్రభాస్‌ను మారుతి ఎలా హ్యాండిల్ చేస్తారో అనేది వారి భయం. ‘క్రాక్’తో విజయం అందుకున్నా.. నిలకడగా విజయాల ఉండవు అనే అపవాదు ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలకృష్ణతో ఆయన ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పోస్టర్లు, లుక్‌ల్లో కొత్తగా బాలయ్య ఏం కనిపించడం లేదు. దీంతో ఆ దర్శకుల చేతుల్లో మన హీరోల పరిస్థితి ‘లైగర్’లా అవ్వకూడదు అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ‘లైగర్’ అవుతారా? లేక టైగర్లలా గర్జిస్తారా అనేది చూడాలి.