టాలీవుడ్లో అభిమానులకు పండుగ వంటిదే వారి అభిమాన హీరోల పుట్టినరోజులు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) బర్త్‌డే వస్తుందంటే ఫ్యాన్స్ అంతా వేచి చూస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజు స్పెషల్ పోస్టర్లు, టీజర్లు లేదా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్లు రావడం సాంప్రదాయంగా మారిపోయింది. ఈ ఏడాది కూడా అదే స్టైల్ కొనసాగనుంది. జూన్ 10న బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఓ కాకుండా రెండు భారీ అప్డేట్స్ రావనున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో అఖండ 2 చిత్రాన్ని చేస్తున్నారు.
ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తవగా, మిగతా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అఖండ సినిమాకు ఉన్న క్రేజ్‌ను కొనసాగించేందుకు ఈసారి బోయపాటి మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి, బాలయ్య బర్త్‌డే రోజున స్పెషల్ టీజర్ రావాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే టీజర్ కోసం ప్రత్యేకంగా కొన్ని విజువల్స్ షూట్ చేసి, గ్రాఫిక్స్ వర్క్ కొనసాగుతోంది. ఇది చాలదన్నట్టు, బాలయ్య బర్త్‌డేకు మరో క్రేజీ అనౌన్స్మెంట్ సిద్ధంగా ఉంది.
గతంలో వీర సింహారెడ్డి (Veera Simha Reddy) వంటి మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో (Gopichand Malineni) బాలయ్య మరో సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జూన్ 10నే రానుందని సమాచారం. ఈ సినిమాను పెద్ది మూవీ నిర్మాతలు వృద్ధి సినిమాస్ నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో పాటు బాలయ్య మరో రెండు కథలను కూడా విన్నట్టు ఇండస్ట్రీ టాక్.
అయితే అవి ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, బర్త్‌డే రోజున వాటికి సంబంధించిన హింట్ వస్తుందా అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది. ఎలాగైనా ఈ బర్త్‌డే బాలయ్య అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు. మొత్తానికి బాలయ్య బర్త్‌డే ఈసారి డబుల్ ట్రీట్‌తో వస్తోంది. ఒకవైపు అఖండ 2 టీజర్‌తో మాస్ ఫైర్, మరోవైపు కొత్త సినిమా అనౌన్స్మెంట్‌తో నందమూరి అభిమానులకు సర్‌ప్రైజ్ రెడీగా ఉంది. జూన్ 10న వీటితో పాటు ఇంకెన్నెన్నో అప్డేట్స్ వస్తాయో చూడాలి.