క్రైమ్ డ్రామా థ్రిల్లర్‌తో హిట్ కొట్టడం అంత సులభం కాదు. ఎక్కడా పట్టు విడవకుండా, సినిమా ఆఖరి వరకు ప్రేక్షకుణ్ని అలరించడం అంత సులభం కాదు. ఇలాంటి కథలతో మన దగ్గర చాలామంది దర్శకులు అదరగొడుతుంటారు. అయితే వాటికి సీక్వెల్స్ తీసి మరీ హిట్ కొట్టడం అయితే కష్టం. కానీ దీనినీ సాధ్యం చేశారు జీతూ జోసెఫ్. ‘దృశ్యం’ ఫ్రాంచైజీతో ఆ పని చేశారయన. అందుకే ఆ సినిమా దేశంలోని కీలక ఇండస్ట్రీలోకి వెళ్తోంది. అంతేకాదు విదేశాలకూ వెళ్తోంది.
‘దృశ్యం’ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు రెండు సినిమాలొచ్చాయి. తొలి సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో రీమేక్ అయ్యింది. దీంతోపాటు చైనీస్, సింహళలో కూడా రీమేక్ చేశారు. తాజాగా ఈ సినిమా ఇండోనేసియా వెళ్తోందట. ఈ సినిమాను ఇండోనేసియాలో తెరకెక్కించాలని ఫాల్కన్ ప్రొడక్షన్ నిర్ణయించింది. ఈ మేరకు మాతృక నిర్మాతల నుండి ఇప్పటికే హక్కులు తీసుకున్నారట. ‘దృశ్యం’ సిరీస్‌లో ఇటీవల రెండో సినిమా మలయాళంలో వచ్చింది. మంచి విజయం అందుకుందని మళ్లీ చెప్పక్కర్లేదు.
తెలుగులో అదే పేరుతో వెంకటేశ్ రీమేక్ చేశారు. త్వరలోనే తెలుగు ‘దృశ్యం 2’ విడుదలవుతోంది. తమిళ, కన్నడ పనులు జోరందుకున్నాయి. ఇప్పుడు ఇండోనేసియాకు వెళ్లడంతో మొత్తం జీతూ జోసెఫ్ సినిమా ఏడు భాషల్లోకి వెళ్లినట్లు అయ్యింది.