డబ్బింగ్ సినిమా.. ఇదేం తప్పు కాదు ఎన్నో ఏళ్లుగా ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమలో చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు స్ట్రయిట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలు బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు డబ్బింగ్ సినిమాలకు పెద్ద పీట వేసి టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలు ఇస్తున్నారు. ఎందుకు, ఏంటి అనే చర్చ ఇక్కడ అనవసరం. అయితే డబ్బింగ్ సినిమా మీద మనకు, మనవాళ్లకు ప్రేమ ఉందని అర్థమవుతుంది. ఈ ప్రేమ చూసేమో ఇప్పుడు ఆడియో ఫంక్షన్‌ని కూడా డబ్ చేశారు. అవును మీరు విన్నది నిజమే ఆడియో ఫంక్షన్‌ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
ఈ అవకాశం మనకు అందిస్తున్న చిత్రం ‘కూలీ’. రజనీకాంత్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేసన్ రూపొందిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. తమిళనాట ఇప్పటికీ చేస్తున్న ఆడియో ఫంక్షన్‌ను ఆ మధ్య చెన్నైలో నిర్వహించారు. ‘అన్‌లీష్‌డ్’ పేరుతో దీనికి సంబంధించిన కొంత ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా అవుతోంది. దీనినే ఇప్పుడు డబ్బింగ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేసే ఆలోచన చేశారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు 15న టెలీకాస్ట్ చేస్తారని సమాచారం.
ఆగస్టు 15న రాత్రి 9.30 గంటలను అన్‌లీష్డ్ తెలుగు డబ్బింగ్ ఈవెంట్‌కు ముహూర్తం పెట్టారు. జెమినీ టీవీలో ఈ ఈవెంట్ ప్రసారం చేస్తారట. అనిరుధ్ అండ్ కో పాడిన (పాడినట్లు నటించిన) తమిళ పాట స్థానంలో తెలుగు పాటలు ప్లే చేస్తారట. ఇక స్పీచ్‌ల సమయంలో డబ్బింగ్ చేశారట. మరి భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి వస్తున్న ఈ డబ్బింగ్ ఆడియో రిలీజ్ ఈవెంట్ ఎలా ఉంటుందో చూడాలి. సినిమా ఎలా ఉంది అనేది తెలియాలంటే ఆగస్టు 14 వరకు ఆగాల్సిందే. ఆ రోజే ‘వార్ 2’ కూడా వస్తున్న విషయం తెలిసిందే.