నవీన్ చంద్ర (Naveen Chandra) నటుడిగా మంచి సినిమాలు, క్రేజీ కాంబినేషన్ ఫిలిమ్స్ చాలా చేస్తున్నప్పటికీ.. హీరోగా ఒక హిట్ కొట్టి మాత్రం 12 ఏళ్లవుతోంది. 2013లో వచ్చిన “దళం” తర్వాత నవీన్ చంద్ర హీరోగా ఒక్క థియేట్రికల్ హిట్ కూడా కొట్టలేదు. మొన్నామధ్య ఓటీటీలో విడుదలైన “భానుమతి రామకృష్ణ, అమ్ము” సినిమాలతో నటుడిగా తన సత్తా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా నెలకో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరిస్తున్న నవీన్ చంద్ర నటించిన తాజా చిత్రం “లెవెన్” (Eleven) నేడు (మే 16) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాతోనైనా హీరోగా నవీన్ చంద్ర హిట్టు కొట్టాడా లేదా అనేది చూద్దాం..!!
కథ: నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అందర్నీ ఒకే విధంగా హతమార్తుస్తుంటాడు హంతకుడు. ఆ కేస్ ను తొలుత డీల్ చేసిన ఆఫీసర్ క్రాక్ చేయలేకపోవడంతో.. ఆ కేసును అరవింద్ (నవీన్ చంద్ర)కు అప్పగిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్.
ఆ కేసును అరవింద్ ఎలా డీల్ చేశాడు? అసలు చనిపోతున్నది ఎవరు? వాళ్లని ఎందుకు చంపుతున్నారు? ఈ మిస్టరీని అరవింద్ ఎలా ఛేదించాడు? అనేది “లెవన్” కథాంశం.
నటీనటుల పనితీరు: ఈ తరహా పోలీస్ పాత్రలు నవీన్ చంద్రకు కొత్త కాదు. అయితే.. ఈ సినిమాలో విభిన్నమైన షేడ్ తో ఆకట్టుకున్నాడు. సీరియస్ & సెన్సిబుల్ రోల్ ను బాగా బ్యాలెన్స్ చేశాడు. అతడి పాత్రతో మంచి ట్విస్ట్ వర్కవుట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అతడి నటన అనే చెప్పాలి.
సపోర్టింగ్ రోల్స్ లో శశాంక్, అభిరామి, దిలీపన్ మంచి నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అభిరామి నటన సినిమా మీద ఆసక్తి పెంచింది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు లోకేష్ క్యాస్టింగ్ విషయంలో తీసుకున్న కేర్ ను మెచ్చుకోవాలి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ ను హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగుంది. అయితే.. కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. మరీ ముఖ్యంగా ప్రొడ్యూసర్ కాబట్టి హీరోయిన్ గా పెట్టుకోకుండా.. ఇంకాస్త బెటర్ పెర్ఫార్మర్ ను తీసుకుని ఉంటే ఆ చిన్నపాటి లవ్ పోర్షన్స్ కూడా బోర్ కొట్టేవి కావు. ఫస్టాఫ్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ కోసమే వినియోగించడం అనేది సహనాన్ని పరీక్షిస్తుంది. సెకండాఫ్ నుంచి కథనం వేగంగా సాగినా, కొన్ని పాత్రల వీక్ పెర్ఫార్మెన్స్ కారణంగా డ్రామా వర్కవుట్ అవ్వలేదు. ఓవరాల్ గా కథకుడిగా అలరించిన లోకేష్, దర్శకుడిగా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.
డి.ఇమ్మాన్ నేపథ్య సంగీతం డీసెంట్ గా ఉంది. ఎమోషనల్ సీన్స్ తోపాటు ట్విస్టులను కూడా బాగా ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. చేజింగ్ సీన్స్ & నైట్ సీక్వెన్సులు బాగా డీల్ చేశాడు. ఆర్ట్ & ప్రొడక్షన్ టీమ్ డిజైన్ డీసెంట్ వర్క్ తో సినిమాకి హెల్ప్ అయ్యారు.
విశ్లేషణ: ఒక్కోసారి కొన్ని సినిమాలు కంటెంట్ తో ఆశ్చర్యపరుస్తాయి. “లెవన్” కచ్చితంగా అలా ఆశ్చర్యపరిచిన చిత్రమే. సినిమాలోని ఇంటర్వెల్ బ్లాక్ & మెయిన్ ట్విస్ట్ ను ఊహించడం కష్టమే. ఆ విషయంలో మేకర్స్ కచ్చితంగా సక్సెస్ అయ్యారు. అయితే.. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎక్కువ టైమ్ తీసుకోవడం, హీరోయిన్ క్యారెక్టర్ మైనస్ గా నిలవడం, క్లైమాక్స్ జస్టిఫికేషన్ లాజికల్ గా కాక హీరోయిక్ గా ఉండడం వంటి కారణాలుగా “లెవన్” ఒక డీసెంట్ థ్రిల్లర్ గా మిగిలిపోయింది కానీ.. హీరోగా నవీన్ చంద్రకు కమర్షియల్ హిట్ ఇవ్వలేకపోయిదనే చెప్పాలి.
ఫోకస్ పాయింట్: డీసెంట్ థ్రిల్లర్!
రేటింగ్: 2/5