మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా అనుకున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఇద్దరు దర్శకులు మారారు. ఫైనల్ గా ‘తని ఒరువన్’ ఫేమ్ మోహన్ రాజాను రంగంలోకి దింపారు. అయితే రీసెంట్ గా ఈ డైరెక్టర్ కూడా సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది.
‘లూసిఫర్’ రీమేక్ కి సంబంధించి దర్శకుడు మోహన్ రాజా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. మూడు, నాలుగు సార్లు మెగాస్టార్ తో కథా చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. స్క్రిప్ట్ విషయంలో చిరు సంతృప్తిగానే ఉన్నారట. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం. కానీ ఇంతలోనే దర్శకుడు మారిపోయాడంటూ వార్తలు మొదలయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువవుతున్న కారణంగా షూటింగ్ ను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకున్నారు. జూలై నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
అప్పటికి నటీనటుల ఎంపిక కూడా పూర్తవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ పొలిటికల్ డ్రామాను ఎన్వీ ప్రసాద్ తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిరు నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యమవుతోంది. ఈ సినిమా తరువాత ‘లూసిఫర్’ రీమేక్ తో పాటు దర్శకుడు మెహర్ రమేష్, బాబీలతో కలిసి పని చేయనున్నారు!