సరైన విలన్ ఉంటేనే హీరోయిజం ఎలివేట్ అవుతుంది అంటారు. అలా అని విలన్ అరవీర భయంకరుడు, గుద్దితే కొండైనా పిండి అయిపోయే బలవంతుడు కానక్కర్లేదు. సాధారణంగా కనిపించినా.. పాత్రను బాగా ఎలివేట్ చేయగలిగేవాడు కావాలి. దీనికి రీసెంట్ ఉదాహరణల్లో భన్వర్ సింగ్ షెకావత్ ఒకటి. ‘పుష్ప’ (Pushpa: The Rise) సినిమాలో ఆ పాత్రలో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) అదరగొట్టాడు. అయితే ఆ సినిమా తర్వాత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో ఆయనకొరు అయ్యారు అనే టాక్ నడుస్తోంది.
ఇదే మాట ఆయన దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం వచ్చింది. మలయాళంలో వైవిధ్య చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ఫహాద్ ఫాజిల్. అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో ఫహాద్ తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం అయ్యారు. అయితే అప్పటికే డబ్బింగ్ సినిమాలు, ఓటీటీలతో అందరికీ ఆయన పరిచయమే. ఆయన భార్య నజ్రియా నజీమ్ (Nazriya Nazim) మనకు తెలుసు. ఇక ఆయన తండ్రి ఫాజిల్ కూడా మనకు తెలుసు. నాగార్జున (Nagarjuna) ‘కిల్లర్’ సినిమా ఆయన దర్శకత్వంలో వచ్చిందే.
ఇక అసలు విషయానికొస్తే.. అదేనండి రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుంటే.. దేనికైనా డబ్బు ఒక కారణం. కానీ అదొక్కటే కాదు. చేసే పని ఏదైనా అది మనలో ఉత్సాహం నింపేలా ఉండాలి. భన్వర్‌సింగ్ పాత్రకు ఎవరు నప్పుతారో దర్శకుడు సుకుమార్‌కు తెలుసు. అందుకే నేను సినిమాలో ఉన్నాను. మేమంతా ఒక భారీ ఇండియన్ కమర్షియల్ సినిమా చేశాం. ‘పుష్ప’ సినిమా టీమ్‌తో కలిసి పనిచేయడం సంతోషాన్ని ఇస్తోంది అని చెప్పారు.
అయితే, దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విలన్‌ను అవుతానో, లేదో మాత్రం నాకు తెలియదు అని రెమ్యూనరేషన్ టాపిక్ గురించి మాట్లాడారు ఫహాద్ ఫాజిల్. ఇక కేవలం డబ్బు సంపాదించడానికే సినిమాలు చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చిన ఆయన.. ‘కుంబలంగి నైట్స్’, ‘ట్రాన్స్’ చిత్రాలతో చాలానే సంపాదించా అని చెప్పారు. నటన ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకోవడం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.